పుట:కాశీమజిలీకథలు -02.pdf/5

ఈ పుట ఆమోదించబడ్డది

10

కాశీమజిలీకథలు - రెండవభాగము

జపించుకొనుచు నాలయమునకుంబోయి ప్రదక్షిణపూర్వకముగా గర్భాలయమున ప్రవేశించి సుభద్రాబలభద్రసహితుండైయున్న జగన్నాయకుని జూచి మేను గరుపార నానందబాష్పములతో ఫాలతలంబున నంజలి ఘటియించి గద్గదస్వరంబున నిట్లని వినుతించెను.

ఉ. సాధుమనీషచేఁబురని ◆ శాచరులీల్గగ బుద్ధధర్మముల్
     బోధనఁజేసి తత్పతుల ◆ పుణ్యమతుల్ బెడబాపి నీలధా
     త్రీధరకూటమం దవత ◆ రించి జగంబులనేలువో జగ
     న్నాథ! వధూసనాథ! కరు ◆ ణన్ బరికింపుము నీకు మ్రొక్కెదన్.

అని మరియుం బెక్కుతెఱంగుల నంతరంగమ్మున నారథాంగపాణి సన్నిధానంబు గల్పించుకొని పెద్దతడవు ధ్యానించి కొండొకవడి కడనుండి కదలి యావరణదేవతల నర్చించు తాత్పర్యంబున నాలయప్రాంగణంబు జేరునంత నందించుక యలుకమొగంబునం బొడఁగట్ట నట్లె నిలుచుండి తన రాకకై వేచియున్న శిష్యుని గాంచి వానికిట్లనియె. గోపా! ఇంతదనుక నెందుంటివి? దేవునిగంటివా? సేవావశంవదుండనై నీమాట మరచితినిసుమీ! కోపము సేయకుము. లోనికిరమ్ము పోదము. నీ కులదేవతయగు వెన్నదొంగం గందువుగాని యని సానునయముగాఁ బలికిన నజ్జడదారికి వాఁ డిట్లనియె.

స్వామీ! నేను మీకుఁ గావడిమోచునప్పుడుగాక యిప్పుడు జ్ఞాపకము వత్తునా? కానిండు. మీదయ నామీద నింతమాత్రమే యున్నది ఏమి చేయుదును? స్నానము చేసినది మొదలు నామాటయే మీకు జ్ఞాపకము లేకపోయినది. నేను మాత్రము విడువక మీ వెంట దిరుగుఁచుంటిని. మీరు గుడిలోనికిఁ బోవునప్పుడు నేనుఁగూడ రాఁబోవుడునచ్చటఁ గాపున్న బెత్తములవా రడ్డుఁ పెట్టిరి. అప్పుడు నేను పెద్దయెలుంగున స్వామీ! స్వామీ! యని యరచుచు మిమ్ము బిలచితిని. మీరు నా మొర వినుపించుకొనక లోపలకుఁ బోయితిరి. నారొద వారించుచు లోపలనుండి యొక పండా బైటికివచ్చి నన్నుఁజూచి యోరీ ! యెవ్వడవు నీవు? ఇట్లూరక యరచెదవేల? యెవ్వరంజీరెదవని యడిగిన నే నిట్లంటిని.

అయ్యా! నేను గొల్లవారి చిన్నవాడను. మాయయ్యవారు లోపలనున్నవారు. వారితోఁగూడ నేను దేవునిఁజూడ దేవళములోనికిఁ బోవుచుండ వీరు వారించిరి. దానికై యరచుచున్నానని చెప్పితిని. అప్పు డాస్వామికి నామీద దయవచ్చినది. అల్పులవలె నున్నతులాపస్నుల మొరలాలకింపకుందురా! లోపల మిగుల సమ్మర్ధముగా నున్నది. కొంచెము సేపు తాళుము. వారు వెలుపలకు వచ్చినతోడనే నిన్నుఁ బంపెదనని చెప్పి యప్పుడె యందున్నవారినెల్ల మెల్లమెల్లన వెళ్ళఁగొట్టించి పిమ్మట నన్ను లోపలకుఁ బంపెను.