పుట:కాశీమజిలీకథలు -02.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

52

కాశీమజిలీకథలు - రెండవభాగము

చున్నట్లు వినంబడినది. అదివిని కృష్ణదాసు తటాలునబోయి తలుపుల దెరపించెను. వీధిలోగొందరు పరిచారకులతో రాజుగారి గుఱ్ఱమెక్కి పౌరులు చుట్టును బరివేష్టింప నెద్దియో పుస్తకము చేతంబూని నిలువబడియుండిరి.

కృష్ణదాసు తలుపుతెరచినతోడనే రాజుగారు గుఱ్ఱమును దిగి లోనికిబోయిరి. కృష్ణదాసు మిగుల భయపడుచు నోహో! నాగుట్టెవ్వరో తెలియపరచిరి. పరీక్షించుటకై వీరువచ్చిరి. ఇప్పుడు తలుపులుతీసి మోసపోయితినని పశ్చాత్తాపముజెందుచు నప్పుడేమియు జేయునదిలేక జేతులుజోడించి రాజుగారి యెదుట నిలువబడియుండెను

రాజు - కృష్ణదాసనువా డెవ్వడు ?

కృ - చిత్తము మహాప్రభూ ! నేనండి.

రాజు - ఈయిల్లు నీదేకాదా ?

కృ - చిత్తము. చితము. నాదేనండి.

రాజు - నీయింటిలో నీపుస్తకము దొరికినట్లు మాభటులు చెప్పుచున్నవారు నిజమేనా?

కృ – చిత్తము నేనాసమయమం దింటిలోలేను. కావున నాకు నిజము తెలియదు.

రా - నీ వింటిలోనున్నట్టు వారుచెప్పిరే? నీవబద్ధమాడుచుంటివేమి ?

కృ – చిత్తము మొదటలేను తర్వాత వచ్చితిని.

రా - ఓహో! ఎప్పుడు వచ్చిననేమి? ఈ పుస్తకము మీయింటిలో దొరికినదా లేదా? చెప్పుమని యడిగిన నెద్దియో చదివెదవేమిటికి ?

కృ – చిత్తము. చిత్తము. నాయింటిలోనే దొరికినది.

రా - ఇది నీయింటికెట్లు వచ్చినది?

కృ - (కొంచెము సేపాలోచించి) దేవా ! యొకనాడు మాయింటికొక బాటసారివచ్చి భోజనముచేసి దీని నిందు వదలి వెళ్ళిపోయెను. నాటినుండియు నిది మాద్వారము మీదనే యున్నది కాబోలు. మేము సైతము చూడలేదు. మొన్న మాకింకరులు దీనిని దీసికొనిపోయిరి. ఇదియె యదార్ధము.

రా - ఆవచ్చినవా డెందుబోయెనో యెయంగుదువా?

కృ– నాకు దెలియదు.

రా -- నీ మాటలు విన శంకాస్పదములుగా నున్నవి నీయిల్లు బరీక్షింపవలసి యున్నది. నీవేమి చెప్పెదవు ?

కృ – తమరు నాకు గ్రొత్తవారా ? మాయిల్లు జక్కగా బరీక్షింపవచ్చును. ఇప్పుడు పూజాసమయము కొంతసేపుండి మరలరండు.

రా - మీపూజ మేము చూడగూడదా ఏమి ?

కృ – మా నియమ మట్టిది. అని యిట్లు కృష్ణదాసు పలికిన విని యనుమానముపడి యారాజు తక్షణమే యతని యిల్లు బరీక్షింపుడని భటుల కాజ్ఞాపించెను.