పుట:కాశీమజిలీకథలు -02.pdf/225

ఈ పుట ఆమోదించబడ్డది

230

కాశీమజిలీకథలు - రెండవభాగము

మేము నియమించుకొనిన మితియు సమీపించినది. అనుజ్ఞ యిత్తువే ? యనుటయు నక్కలకంఠి మెల్లన నిట్లనియె, వత్సా! భవత్సఖునకు మాయందనురాగము కొరంతయైనను బుత్రకుని దలంచి యైనను జూడరాదగదా! మాకు దయ యందుగల మక్కువ యెరింగియు నింతకాల మాలసించుట మిక్కిలి యద్భుతముగా నున్నది. ఇక స్వల్పకాలము జాగుచేసిన స్త్రీ సాహసము లోకప్రసిద్ధమైనదియే. తరుచు జెప్పవలసినదిలేదు. నీవార్తాశ్రవణమే యాగమనావధియని చెప్పుమని పెక్కు బోధించి హరిదత్తునికి జెప్పురీతి జెప్పి యెట్టకేలకు వారి నచ్చటినుండి పంపెను.

బలభద్రం డా హరిదత్తునితో గూడి యంతఃపురము వెడలి సత్రంబునకు బోయి యందున్న రత్నవతీ బ్రహ్మావధానుల గలసికొని వారితో హరిదత్తుని వృత్తాంత మంతకుమున్ను జెప్పియున్న వాడు కావున వారును నతనిజూచినంత బట్టరాని సంతోషముతో నతనిం గౌగలించుకొని పెద్దతడవు గారవించిరి. హరిదత్తుడును వారియెడల మిక్కిలి సౌహృదయము జూపుచు దానగ్రజుంగలసికొని వచ్చునందాక నచ్చోట నివసింప నియమించి యెట్టకేలకు వారిచే ననిపించుకొని యచ్చట వెడలి బలభద్రునితో నిట్లనియె. మిత్రమా! నాకిప్పుడు మా యన్ననుజూడ మిక్కిలి యాతురముగా నున్నది. కాలవ్యవధి సహింపనోప గావున జాగుసేయక వేగము నన్నతని యొద్దకు దీసికొని పొమ్మని పలుకుచు దొందరబెట్టుగా నతడును సంతసించి యతనితో నిట్లనియె.

తమ్ముడా! మేము నియమించుకొన్న సంకేత సమయము మూడుదినము లున్నది. అప్పటికి మనము సులభముగ బోగలము. అతండు నాటిదివసము సాయంకాలమున కచ్చోటునకు రాగలడు రమ్ము పోదమని పలుకుచు గతిపయ ప్రయాణముల బుష్పపురికి దీసికొని పోయెను బలభద్రు డందొకచోట బసజేసి తానుబోయి అదృష్టదీపుని దీసికొనివత్తుననియు నంతవరకు నీవిచ్చోట నివసించియుండు మనియు హరిదత్తునితో జెప్పి వారు సంకేత మేర్పరచుకొన్న స్థలమునకు బోయెను. ఇంతలో నూరక యింటియొద్ద కూర్చుండనేలయని హరిదత్తుడు చక్కనివేషముతో వింతలం జూచుటకు నంగడికి బోయెను. ఆ దివసము శుక్రవారమగుటచే బ్రియంవద కలహంసికతో గూడ బండియెక్కి విహారశైలమునకు బోవుచుండ దారిలో హరిదత్తు డెదురు పడుటయు శకటగవాక్షరంధ్రంబులనుండి చూచి కలహంసిక గురుతుపట్టి, అక్కా! అదిగో! చూడుము చూడుము నీ ప్రియుం డేగుదెంచినాడని చూపగా జూచి ప్రియంవద యంతకుమున్ను విరాళింగుందుచున్నది. కావున మిక్కిలి సంతోషముతో బండి యాపించి కలహంసికను బండి దింపి గ్రీడాశైలమున కతని దీసికొని రమ్మని చెప్పి తాను బండి తోలించుకొని యచ్చటికి బోయినది.

కలహంసికయు నతనిని మును తాను జూచిన యదృష్టదీపుండే యనుకొని మెల్లగా జెంతకుబోయి నమస్క రించినది. అతండును తెల్లబోయి లోకాచారప్రకారము దీవించెను. అదియు జిరునగవుతో దేవరవా రెప్పుడు దయచేసినారని యడుగగా నీ