పుట:కాశీమజిలీకథలు -02.pdf/198

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రియంవద కథ

203

వాత నదృష్టదీపు డాప్రశ్నము లేవియని యడుగగా నారాజుగా రట్టి ప్రశ్నములు గల పత్రికను దెప్పించి యతనిచేతి కిప్పించెను.

గీ. ఎన్నభువనేశ్వరీదేవి కెన్ని మొగము?
    లవియు నేయేరుచులచేత నమఱు! మఱి త
    దాలయం బెట? నటదగు నట్టిలిపియ
    దేమి? యది చెప్పుడివి మదీయేచ్ఛపగిది.

క. వీనికి సదుత్తరము లెవఁ
   డైన నొసంగినను వాని బ్రాణాధీశుం
   గా నెంచెద మడియించెద
   బూనుచు నటు చెప్పలేకపోయిన యంతన్.

అట్టి పద్యములు గల యా పత్రికను రెండు మూడుసారులు చదువుకొని తలయూచుచు నారాజు ననుజ్ఞ బుచ్చుకొని యింటికిబోయి తన కెదురుగా వచ్చినమిత్రునితో నిట్లనియె. బలభద్రా! నాకాయువింక నారుమాసములున్నది. ఈ ప్రశ్నముల కెవ్వడు నుత్తరము చెప్పలేడు. మిగుల నసందర్భముగా నున్నవి. భువనేశ్వరీదేవి యాలయ మెచ్చటనున్నదో యెవ్వరు చెప్పగలరు? అయినను మనయోపినంత ప్రయత్నము చేయుదుము. నీ విచ్చటనే యుండుము. నేనొకసారి దేశాటనము చేసి వచ్చెదనని పలుకగా నబ్బలభద్రుడు కన్నీరు విడుచుచు నిట్లనియె. అయ్యో! నేను మొదటనే నిదానించుమని చెప్పితిని కాదా! అట్లు చేయక తొందరపడి యొప్పుకొని వచ్చితివేమి? దీని కేమిచేయుదము. ఈ ప్రశ్నల కెవడు నుత్తరము చెప్పలేడట. ఏమి చెప్పినను కాదని యురిదీయించునట. నీతో నీ సంగతి యెఱుగక జెప్పితినే. నీ వింత సాహసము చేయుదు వనుకొనలేదు. జగద్విదితమగు కీర్తి వహించి చివరికొక యాడుదాని మూలమున బలవన్మరణము జెందవలసివచ్చినదా! కటకటా! నేనందులకు సమ్మతింతునా? మనమిప్పు డెవ్వరికి దెలియకుండ మన పల్లెకు బారిపోయిన మనలను బట్టుకొనలేరు. తరువాత హరిదత్తుని సంగతి యేదియో యొకటి యగును. అంతియ కాని మనమూరక వీరికి బ్రాణము లప్పగించమా యని పలుకుచు దీనాసనుడై యున్న బలభద్రునికి నదృష్టదీపుం డిట్లనియె.

తమ్ముడా! నీ విందుల కేమియు విచారింపకుము. దేహమనునది గ్రుక్కెడు ప్రాణముతో నున్నది. ఇట్టి దానికొరకు నసత్యమెట్లు యాడుదును? మన పూర్వులీసత్యముకొరకు బడినయిడుము లెట్టివో యెఱుంగుదువా! బ్రాహ్మణుని నిమిత్తము శరీరము విడుచుటకంటె సుకృతమున్నదా? ఈ శరీర మెప్పటికైన నస్థిరమైనదే కదా? అదియునుంగాక కాలమొక్కరీతి నెవ్వరికిని నడువదు. మనము మంచిదినములలో విత్తమేమియును లేకయే యెంతఖ్యాతి సంపాదించితిమో చూచితివా? ఆ కాలము గతించినతోడనే కాసునకైన గొరగాకుంటిమి. దరిద్రులయొక్క దీనాలాప