పుట:కాశీమజిలీకథలు -02.pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది

198

కాశీమజిలీకథలు - రెండవభాగము

నకు బోయెను. అంత నుదయంబున నచ్చటికి జతురిక వచ్చిన నదృష్టదీపుడు చెప్పిన ప్రకార ముత్తర మిచ్చి యది చదువుచున్న సమయములోనే యిదిగో వచ్చెదనని చెప్పి పారిపోయెను.

ఆ యుత్తరము జదువుకొని యావ్రాలుజూచి యదృష్టదీపమహారాజు ప్రసిద్ధి యంతకు బూర్వము వినియున్నది కావున సన్యాసిమాటలు స్మరించుచు నతండు తప్పక యట్టివాడే యని నిశ్చయించి సంతోషవిచారంబులు మనంబునం బెనంగొన వడివడిబోయి యా యుత్తరము గాంతిమతికి జూపినది.

అమ్మత్తకాశిని తత్తరముతో నా యుత్తరమును జదువుకొనిన తరువాత నిరువురకును నీరీతి సంవాదము జరిగినది.

కాంతిమతి - చతురికా! నిజముగా నతండు మనము ప్రసిద్ధిగా జెప్పుకొనుచున్న యదృష్టదీపమహారాజే!

చతురిక - దానికి సందేహమా! అతని మొగము చూచినం దెలియదా? వట్టివాని కంతసౌందర్యము గలుగునా?

కాంతిమతి - అతడు సౌందర్యముచేతనేగాదు గుణములచేతగూడ గొనియాడ దగినవాడు సుమీ?

చతురిక - కనుకనే యంతప్రసిద్ధి వచ్చినది.

కాంతిమతి - నాకు మొదటినుండియు నట్టివాడే మగడు కావలయునని కోరికయుండునది నీకును జ్ఞాపకముండవచ్చును. నీతో చెప్పియే యుందును.

చతురిక - ఇంతకును నీ యదృష్టము మంచిది. శకుంతలవలె మంచిమగని సంపాదించుకొంటివి.

కాంతిమతి - నేనే! నీ వట్లనక యేమందువు ఉత్తములెప్పుడైన స్వప్రయోజకత్వమును బ్రకటించుకొందురా?

చతురిక - దానికేమి నీయుఛ్రయము నాదికాదా? ఇప్పుడు మీ తండ్రి వినినను సంతసించును.

కాంతిమతి - ఇక మనము నిర్భయముగా జెప్పవచ్చును.

చతురిక - మనము జెప్పనక్కరలేదు. నీ గర్భమే చెప్పగలదు.

కాంతిమతి - (సిగ్గుతో దల వంచుకొని) ఇది నిజమని నిశ్చయించితివా యేమి ?

చతురిక - భవదీయచూచుకముఖంబుల నీలసితవర్ణంబులే నిశ్చయింపుచున్నవి.

కాంతిమతి - అగుంగాని యీ వియోగభారంబెట్లు సైతును అతండెప్పుడు వచ్చునో?

చతురిక - అతనితో నీకేమి పనియున్నది? నీకు గావలసినపనియైనదిగదా?