పుట:కాశీమజిలీకథలు -02.pdf/187

ఈ పుట ఆమోదించబడ్డది

192

కాశీమజిలీకథలు - రెండవభాగము

ఇంతకన్న విస్తరించి వ్రాయనవసరములేదు. అనియున్న పేరులేని యుత్తరము ముమ్మారు చదువుకొని చింతాక్రాంతస్వాతుండై యొక్కింతసేపు ధ్యానింపుచు దల యూచుచు అన్నన్నా! యీ వ్రాసినరీతియంతయు యథార్థమయి యుండవచ్చును స్త్రీ లెట్టిపనులకును సాహసులే కదా.

కానిమ్ము ఇవ్విధమంతయు నేడు పరీక్షించి నిజమైనచో నా కులపాంసురాలను శిక్షించి కులము నిష్కళంకము చేసెదనని నిశ్చయించి యప్పుడే సభజాలించి యంతఃపురమునకు బోయి భార్యం జీరి యింతీ! మనకాంతిమతి యిప్పుడేమి చేయుచున్నది పనియున్నది. యొకసారిచ్చటికి రప్పింపుమని జెప్పెను. ఆ మాటవిని భయపడుచు నోహో! పుత్రిక నెప్పుడును జిరంజీవని యని పిలుచుచుండును గాని పేరుతో పిలుచువాడుకాడు. నేడెద్దియో కారణమున్నది. ఆ చిన్నది యెద్దియేని తప్పు చేయలేదుగదా? యని తలంచుచు గూతురిం దీసికొని రమ్మని యొక పరిచారికం బంపినది. అదియు కన్యాంతఃపురమునకు పోయివచ్చి యమ్మా అమ్మాయిగా రుదయముననే యుద్యానవనమునకు బోయినారట. రాత్రికిగాని యింటికిరారట. అచ్చటి వారు చెప్పినారని రాజు వినుచుండ జెప్పినది.

ఆరాజప్పులుకులు విని నిప్పు ద్రొక్కిన కోతివలె నా రహస్యము భార్యకును జెప్పక నాటి సాయంకాల సమయమున నుచితపరివారముతో బండియెక్కి యా యుద్యానవనమునకు బోయెను. ఆ ద్వారమున మరియు బెక్కండ్ర కింకరుల గాపు బెట్టి యా లోపలనుండి క్రొత్తవాడెవ్వడేని వచ్చిన బోనీయక పట్టుకొని యుండుడని యాజ్ఞాపించుచు తా నొక్కరుడ యత్తోటలో బ్రవేశించి వెదకుచు గాంతిమతియున్న సౌధము దాపునకు బోయెను. ద్వారముననున్న చతురిక దూరముగానే రాజుగారిని గురుతుపట్టి తమ గుట్టు దెలిసికొనుటకై యరుదెంచినట్లు గ్రహించి తొట్రుపడుచు వడివడి లోనికిపోయి మన్మథకేళిపారావారవీచికలం దేలియాడుచున్న వారితో మనలను బరీక్షించుటకు రాజుగారు వచ్చుచున్నవా రని జెప్పినది.

ఆ మాటలు విని యదృష్టదీపు డదిరిపడి యేమేమి? రాజుగారే వచ్చుచున్నారా? అయ్యో! యేమి చేయుదునని తల్లడిల్లుచు నలుమూలలు వెదకి యా సౌథమువరకు నెదిగియున్న యొక మ్రాను జూచి కాంతిమతి వలదువలదని చెప్పుచుండగనే వినిపించుకొనక యాచెట్టుకొమ్మలు వంచిపట్టుకొని మెల్లగా యాధారము చేసికొని యా మ్రాకుమూలమునుండి భూమిమీదికి దిగెను. అప్పటికి గనుచీకటి పడుచున్నది. గావున నరణ్యమువలె లతలచే దట్టముగా నల్లుకొనబడియున్న యాయుద్యానవనములో దాగికొనియున్నవాని నరయుటకు బ్రహ్మతరముకాదు.

ఇంతలో నారాజు మేడ యెక్కుచు దారిలోనున్న చతురికం జూచి యేమే చతురికా! కాంతిమతి యెచ్చట నున్నదని యడిగెను. అదియు దేవరా! యీ మేడ మీదనేయున్నది. ఇంటికి రావలయునని పయనమగుచున్నదని చెప్పి యచ్చటికి దీసికొని