పుట:కాశీమజిలీకథలు -02.pdf/164

ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మపాలుని కథ

169

రెండవదారిని లోపలఁ బ్రవేశింపఁ దొడంగుటయు విజయకేతుఁడు విచారించి సత్వరముగా నిరువురదాదులతో రాజపుత్రునితో రాజపత్ని సునందనుఁ బ్రచ్ఛన్నమార్గమునఁ గోటదాటించెను. ఆసమ్మర్దములో రత్నవతియను దాదియు సునందయు నొకమార్గమునను రాజపుత్రునెత్తుకొని నింబవతియను దాదియొకమార్గంబునఁ బోవుటచే నొకరిజాడ యొకరికిం దెలిసినదికాదు. తరువాత రెండవదారిని వచ్చి శత్రుబలము గోటలో బ్రవేశించుటఁజూచి రాజు పారిపోవుట కుద్యోగించుచున్న సమయమున దుర్వినీతుఁడు వీరభటులతో వచ్చి యతనిం బట్టుకొనియెను.

అప్పుడు రాజు దుర్వినీతునింజూచి యోరీచెడుగ! ఇట్టిద్రోహముచేయుదు వనుకొనక నీకుద్యోమిచ్చి నందులకు గదా యిట్టి యుపద్రవము దెచ్చిపెట్టితివి కానిమ్ము దైవము నీకెప్పటికేని నాపదలు గలుగఁజేయకుండునా? నీవుమాత్రమెల్లకాల మిట్లుందువా? మోసము సేసి హఠాత్తుగావచ్చి జయించుట బంటుతనముకాదు. కాలవ్యవధి నిచ్చిన నీపౌరుషము గనుఁగొని యుందును. కానిమ్ము మాకిప్పుడు చెడుకాలము వచ్చినది. విజయకేతుని మాటలువినక విహారభద్రుని నమ్మినందులకు మంచిప్రాయశ్చిత్తమె యైనది. అని యీరీతిఁ బెక్కుగతుల దుర్వినీతుని నిందించెను. కాని దేనికి వాడు సమాధానము జెప్పక యతని పాదములకునుఁ జేతులకు నిగళంబులు దగిలించి తీసికొనిపోయెను.

అప్పుడు వసురక్షితుని సేనలో జయజయధ్వను లెసంగినవి. పిమ్మట విజయకేతునికై ప్రయత్నములు సేసరికాని యతఁడెందునుఁ గనఁబడలేదు. పిమ్మట వసురక్షితుడు దుర్వినీతుని కొంతబలముతో నాకోటలోనుండ నియమించి తానును మంత్రియు ధర్మపాలుని తీసికొని బలములతో నింటికిఁబోయి యతినినొక చెరసాలలోఁ బెట్టించిరి. ఆహా! అవినీతుఁడగువారి కాపదలు రాకమానునా! ఇంతకు నది కాలమహిమ కాక వేఱొకటి కాదు.

అదృష్టదీపుని కథ

వత్సా ! రాజపత్ని సునంద పుత్రునెత్తుకొని యిరువుర దాదులతో నరణ్యమార్గంబునం బడిపోయెనని చెప్పితినిగదా! వారిలో నింబవతియనుదాది రాజకుమారు నెత్తుకొని ముందుగా వడివడి పరుగెత్తుచు శత్రువులు వెనుక వచ్చుచున్నా రేమోయని తిరిగితిరిగి చూచుచు నొకపగలును రాత్రియు నడచి మఱునాడు సూర్యోదయము వేళ కొక మహారణ్యములోనికిఁ బోయినది. రాత్రియంతయు మిగుల శ్రమపడి నడచినది