పుట:కాశీమజిలీకథలు -02.pdf/117

ఈ పుట ఆమోదించబడ్డది

122

కాశీమజిలీకథలు - రెండవభాగము

నట్లు తలంచను. ఈ భక్తురాలు తిలోత్తమకాదుగద; సందేహమేల, నిరూపించి చూడ దానియాకారమంతయుఁ బొడగట్టుచున్నది. మొదట వికృతవేషముతో నుండుటచే గనిపెట్టలేక పోయితిని. ఈ కంఠస్వరము దానిదే! అన్నన్నా! తిలోత్తమా! నీకు నెట్టి యవస్థవచ్చెనే! పాపపు విధీ! నీవెంతనిర్దయుఁడవురా! అట్టి మహారాజుకూఁతున కిట్టి యవస్థఁ దెచ్చి పెట్టితివి. అని పెక్కు తెఱంగుల నంతరంగమ్మున వగచుచు నంతటితో సంగీతము చాలింపుమని చెప్పి పైవారినందరను దూరముగాఁ బొమ్మని యానతిచ్చి నా భక్తురాలికిట్లనియె.

తల్లీ! నీవు పాడిన గీతమునకు నా యుల్లము నీరైపోయినది. నేడు నీదర్శంబున నాకులంబంతయు ధన్యతం బొరసె మరియు నీకులశీలనామంబులు విన నాడెందము మిగుల నుత్సాహమందుచున్నది. నీవిచ్చటి కెట్లువచ్చితివి? ఇప్పుడు పాడిన గీత మెవ్వరియొద్ద నభ్యసించితివి? నీనివాసస్థల మెచ్చట? తల్లిదండ్రులెవ్వరు? నీవృత్తాంత మెరిగించి నాకానంద మాసాదింపుమని మిక్కిలి వినయముగా బ్రార్ధించెను. మంత్రిపలికిన వినయోక్తులకు భక్తురాలు మెచ్చుకొనుచు అయ్యా! నాపూర్వాశ్రమవృత్తాంత మేమియు నేను గురుతెఱుంగను. ఇప్పుడు నన్ను భక్తురాలని పిలుచుచుందురు. ఈవిజ్ఞానయోగి శిష్యురాలను. తారకేశ్వరుని సేవించుటయే నాపని ఇంతకన్న నాకీజన్మమున మఱేమియు లేదని చెప్పగావిని యమ్మంత్రి అప్పటి కంఠస్వరమువలన మరియుం గురుతు తెలిసినది కావునఁ దప్పకఁ దిలోత్తమయేయని నిశ్చయించి యది చెప్పిన మాటలకు మనమున శోక మావేశింపఁ గన్నుల నీరు గమ్ముటయు నాపుకొనుచు నతఁడు మఱల నిట్లనియె.

తల్లీ! నన్నన్యురాలిఁగాఁ జూడకుమని పలికిన యంతలోఁ దెలిసికొని నాలుకఁ గరచుకొనుచు నన్యభావంబునఁ జూడకుము నీపూర్వవృత్తాంతము వినిన మిక్కిలి వేడుక యగుచున్నది నీకెద్దియేని మనుష్యకృతములగు నాపదలు సంభవించినం జెప్పుము తప్పక నవి యన్నియు దొలుంగఁజేసెదను. ఆపన్నుల రక్షించుటయేగదా రాజధర్మము. నీ ముఖము జూడ నెద్దియో విపత్తు నొంది యిట్టి వైరాగ్యము బూని యున్నదానవని తోచుచున్నది. నాకు జెప్పుటవలన నీ కుపకృతియే యగును. ప్రజలు తమయిడుమల నొడయనితోఁ జెప్పుకొనుట యావశ్యకము నీ వీయోగినీవేషము వేసికొని యెన్ని దినములయినది? ఈగుడిలో నెన్నిదినములబట్టి యుంటివి. నీగురు వెందున్నవాఁడు చెప్పుము. చెప్పుమని మిక్కిలి లాలనగా నడుగుటయు నాభక్తురాలు ఒక్కింత సేపూరకుండి కన్గొనల నుండి వెడలు నశ్రుకణముల నుత్తరీయంబున నొత్తుచుఁ బుణ్యాత్మా! ఈనిర్భాగ్యురాలి చరిత్రతో మీ కేమిప్రయోజనము గలదు. దీనిని వినినంత మీస్వాంతమునఁగూడ చింత యుదయించును. నాకెద్దియో యుపకృతి జేయునంతటి యాదరణతో మీరడుగుచుండ వచింపకుండుట మూర్ఖతగదా సర్వసుఖపరిత్యాగము జేసిన నాకు మరల సౌఖ్యము