పుట:కాశీమజిలీకథలు -02.pdf/111

ఈ పుట ఆమోదించబడ్డది

116

కాశీమజిలీకథలు - రెండవభాగము

కర్మసూత్రంబునం బట్టిపోయెదను అని పెక్కుతెరంగులం దలపోయుచుఁ వాడు తెచ్చియుంచిన యాహారపదార్ధంబులు భుజించి యాకలిఁ దీర్చుకొని మెల్లగా నచ్చటఁ గనంబడిన త్రోవంబడి నడువసాగినది.

ఆదారింబడి పోవంబోవ సముద్రతీరంబునకుఁ బోయినది. చంద్రలేఖకు మొదట సముద్ర మొకరాతిపలకలాగునఁ గనఁబడినది శ్రీరామచంద్రుఁడంతవానికి సముద్రమునుఁ జూచినంత భయమైనది. ఇఁక చంద్రలేఖ మాట చెప్పనేటికి? చంద్రలేఖ సముద్రంబు పేరు వినుటయే కాని యెన్నఁడును చూచియెరుఁగదు. దానిం జూచినంత హృదయము భేదిల్లినది.

అట్టి సమయంబునఁ గర్తవ్య మెద్దియో తెలియక పర్వతంబు లాగునఁ బొంగివచ్చెడు తరంగంబులం గాంచి అవి మీఁదబడునను వెఱపున వెనుకకుఁ బరుగిడుచు నేమూలకుఁబోవుటకు తెరవుగానక పరిపరిగతులం దలపోయుచుఁ దన చరిత్రను స్మరించుకొని వెతఁజెందుచు నా సముద్రముపై దృష్టినిడి యావిశేషము లరయుచుండెను. ఇంతలో గాలి క్రమక్రమముగా బలసి యెక్కుడుగా వీవఁదొడంగుటయు నా ప్రతికూలవాతపాతంబున నాసాగరంబులోఁ బోవునోడ యొకటి యా చంద్రలేఖ యున్న యొడ్డునకుఁ గొట్టుకొని వచ్చెను. అందున్న జనులందరు నాగాలితాకున నోడ మునుఁగక దరిఁజేరినందులకు మిగుల సంతసించిరి.

అప్పుడు కర్ణధారుఁడు జనులంజూచి రాత్రి యీతీరమున నుండవలయును. తూరుపుగాలి తిరిగినతోడనే యోడ నడిపింతుము కావున మీరందరును దిగి యిచ్చట వంటలు చేసికొని భుజింపుఁడని పెద్దయెలుంగునం జెప్పెను. అప్పు డందున్న వారందరు వానిమాటలు విని తమ తమ సామగ్రులతో తీరంబునకు దిగిరి సాధారణంబుగ సముద్రతీరంబున మంచినీరు పడును గనుక నచ్చట చిన్న చిన్న చలములు తీసి యా యుదకంబుచే వంటలు చేసికొని నాఁటిరాత్రి ప్రతికూలవాతమును నుతియింపుచు యథేచ్ఛముగా భుజించిరి. సముద్రతీరభూమి అంతయు జనాకీర్ణ మగుట నా జనసంఘములోఁ జంద్రలేఖను జూచినవారెల్ల తమతో వచ్చిన బాటసారిఁగా నెంచిరి. చంద్రలేఖయు నట్టివిజనభూమియందు జనసహాయంబునుఁ గూర్చిన భగవంతుని వేతెరంగులఁ గొనియాడుచు నారాత్రి సుఖముగా గడిపి యుదయంబున నబ్బాటసారులతోఁగూడ దానును నోడనెక్కెను. ఓడసరదారుఁడు అది రేవు స్థలముకాదు కావున నప్పు డెక్కినవారి నంతగాఁ బరీక్షింపఁడయ్యెను

అప్పుడు మంచిగాలి విసరుచున్నందున తెరచాప లెత్తించి యోడ విడుచుటయు రెండుదినములు నడువవలసినపయన మొకనాఁటికే నడచినది. కావున నమ్మరునాటియుదయమునఁ ద్రిగర్త దేశరాజధానియైన యలకాపురము రేవుజేరెను. అప్పుడు కర్ణధారుని అనుమతి నందున్న జనులందరు నోఁడదిగిరి. చంద్రలేఖయుఁ డిగఁబోయినది కాని తాను సొమ్మిచ్చినందులకు గురుతుగల పత్రిక తనయొద్ద లేమింజేసి నావి