పుట:కాశీమజిలీకథలు -01.pdf/88

ఈ పుట ఆమోదించబడ్డది

వసంతుని కథ

77

సుమీ యని పెక్కునీతులు దెలిసినదానివలె బోధించుటయు నాలించి యా యిందుముఖి యందు గొన్నివాక్యంబులు తనకు గర్ణకఠోరములుగా నున్నను సైరించి యిదియేమో తన క్షేమముగోరియే యట్లనుచున్నదను నమ్మకముచే మరుమాట పలుకక యట్లడిగెద ననుమాట శిరఃకంపమున సూచించిన నంతటితో నా ప్రస్తావము కట్టిపెట్టి వేరొక్కగోష్ఠిచే బ్రొద్దుపుచ్చుకొనిరి.

ఇంతలో దినాంతమగుటయు వసంతు డింటి కరుగుదెంచిన సంతసించి వారెన్నేని నుపచారంబులం దీర్చిరి. అతండు నిష్టాహారసంతుష్టుండై యీప్సితకామంబుల దీర్చుకొనియె. ఇట్లు నాలుగైదువాసరము లరిగినను కళావతి కాప్రస్తావము తెచ్చుటకు వీలుదొరికినది గాదు. ఒకనా డత డుదయమున వేటకై తొందరగా నటవి కరుగుచుండ నాదండ కరిగి యతని కైదండబట్టి కాని యయ్యండజయాన యిట్లనియె.

నాథా! మీరు సారెసారెకు ఘోరమృగయాసక్తి నడవి కరుగుచుంటిరి. ఒంటరిగా మేమిచ్చోట నుండజాలము. మీ కందేమైన బ్రమాదము సంభవించినచో మాకేది దిక్కు. ఈసారి మమ్ముగూడ దోడ్కొని పోయినం బొండు లేకున్న మీ యాయుఃప్రమాణనిశ్చయం బెరుంగుదురేని వక్కాణింపుడని కేల్వదలక నిర్బంధించిన సంతసించి యాచంచలాక్షిని గౌగిట జేర్చుకొని యతం డా రహస్యం బదివర కెవ్వరికి జెప్పనని నిశ్చయించుకొనియు బ్రయాణపు తొందరచే మరచి యత్తెరవతో నిట్లనియె.

బోటీ! నాకు భయమేమిటికి? వినుము. మదీయ మిత్రుడగు నొక కళాదునిచే నా యాయు నీ కత్తివరలో నుంచబడినది. ఇది నీయొద్ద నుంచికొనుము. దీనికి బ్రమాదము వచ్చిననాడుగాని నాకు బ్రాణభయము రానేరదు. దీనిం గాపాడుకొనుమని నిదానించక యది యమ్మదవతి చేతికిచ్చి తాను వేటకై యటవికరిగెను. ఎట్టి నేర్పరియైనను విధిగతికి బద్ధుడై ప్రమాదము నొందక మానడు.

అతండొకింత నిదానించినచో నా కపటము దెలిసికొనదగినవాడే. "బుద్ధిః కర్మానుసారిణి" యను వచనంబునుం బట్టి యతని కట్టి యూహపుట్టినది కాదు.

పిమ్మట నవ్వరవర్ణిని యవ్వరవృత్తాంతమంతయు నమ్ముసలిదాని కెరింగించిన సంతసించుచు నప్పడతి కిట్లనియె. అమ్మా! మనము వఱయరలు ప్రాణపదముగా గాపాడుకొనవలయును జుమీ. ఎక్కడ దాచెదవోకాని మన బ్రతుకంతయు దీనితో నున్నది. యనిన నదియు నమ్మా! యెక్కడ దాచినను భయమేమి. మనముగాక యన్యు లెవ్వరేనిం గలరా? నిత్యమును జూచుచుండవచ్చును. నీ మంచము తలకడ నునిచెద ననిన నౌను భయమేమి యట్లె యుంచుమని చెప్పినది .