పుట:కాశీమజిలీకథలు -01.pdf/45

ఈ పుట ఆమోదించబడ్డది

34

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వారమని మిగులఁ బ్రతిమాలుకొనుటయు నవ్వనిత తనలో మఱియు మిగుల నవ్వుకొని అయ్యా! ఇప్పుడు చాల ప్రొద్దెక్కినది. మాయింటికి వచ్చి వంటఁ జేసుకొని భుజింపుఁడు. భోజనమైన పిమ్మట నంతయుం జెప్పెదననుటయు నామె మాటకు వారు మిగుల నాకలిగొనియున్నవారు గావున సంతసించి యామెతోగూడ వారి యింటి కరిగి, ఆ సతీమణియు వారి కొకగది చూపి అందు వంటసామగ్రి నంతయు నమర్చి పెరటియందున్న నూతియందు స్నానము జేసి వేగిరముగా వంటఁ జేసికొని భోజనము సేయుఁడు. నా మగఁడు మిగుల ననుమానము గలవాఁడును ధూర్తుండు నగుటచే నాయన వచ్చినచో మిమ్మును నన్నునుగూడ దండించును. ఆయన నిత్యమును రెండుయామములదనుక రాజుగారియొద్ద పురాణముచెప్పి పండ్రెండుగంటలు కొట్టినతోడనే యింటికి వచ్చుచుండును. ఇపుడు పదిగంటల ప్రొద్దెక్కినది. త్వరగా వంటఁ జేసుకొనుఁడని తొందరపెట్టుటయు వారు నామె చెప్పిన చొప్పున నూతియొద్ద స్నానము జేసి యా గదిలో వంటఁ జేసికొనుచు స్తోత్రపాఠములఁ బఠించుచు భగవద్గీతల బారాయణము చేయుచు నతివేగముగా ముగింపవలయునని తలంచిరి. కాని దేవతార్చన చేయుచుండగనే పండ్రెండు గంటలు కొట్టిరి. అంతలో యజమానుడు వచ్చి తన వాడుక ప్రకారము నాలుగుగదులు వెదికిచూడఁగా నొకగదిలో నీబ్రాహ్మణు లుండుటఁ జూచి తల కంపించుచు వేగముగా నాయింటికి దాళము వైచి భార్యయున్న యింటికిని బీగము బిగించి వాకిళ్ళన్నియు మూసి వీథితలుపునకు లక్కశీలుతో ముద్రవైచి యతిజవంబున రాజనగరికిఁ బోయెను.

గోపా! వినుము. ఆ బ్రాహ్మణునికి భార్య విషయమై మిగుల ననుమానము గలిగి యొకప్పుడు రాజుగారితో అయ్యా! తమరు పెక్కు నేరములకు శిక్షలు విధించుచుంటిరి గాని జారత్వదోషమునకుఁ గూడఁ నేల విధింపరని యడిగిన నతం డట్టి దోష మెక్కడనున్నదో వక్కాణించిన దండింతుననియె. దానికా బ్రాహ్మణుడు సిగ్గువిడిచి యెక్కడనో యని చెప్పనేల నీ దుర్మార్గపుకృత్యము మా యింటనే జరుగుచున్నది. నేను తమయొద్దకుఁ బురాణము సెప్పుటకు వచ్చిన పిమ్మట నిత్యమును నా భార్య విటులతో నింటికడ స్వేచ్ఛగా సంచరించుచున్నదని చెప్పెను. అవ్విషయము రాజు పెక్కండ్ర నడిగి యామె మహాపతివ్రతగాఁ దెలిసికొని పురోహితునితో నార్యా! మీరు అసత్యమాడితిరి. మీ భార్య కడునిల్లాలఁట. మీ రిట్లంటి రేమని యడిగిన నతం డయ్యా! తమ రడిగిననవారలు దాని విటులే. ఈ సంగతి తమకుఁ బాగా దెలిసినచో నమ్మకపోదురే! యనుటయు నా నృపతి యటులేని మీ భార్య విటులతోఁ గూడి యున్నప్పుడు వచ్చి నాకుఁ జెప్పుదు . నేను వచ్చి యట్టి కృత్యము జరిగించుచున్నదని తోచినచో వారినెల్లఁ దప్పక దండింతునని ప్రతిజ్ఞ చేసి యుండెను. కావున నట్టి విటులు