పుట:కాశీమజిలీకథలు -01.pdf/194

ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

183

కొంత పరిశీలింపనగు. ఒక్కొక్క కారణంబునం బుట్టిన కోపంబు ఒక్కొక్క పనితోడన తీరును. ఆ యెత్తిన కత్తి వాల్చనం గాని నాకు వాక్కు రాకున్నది. కంఠగతప్రాణనైన నా మొరవినుట నీకేపాటి లోపంబని ప్రాణభయయార్తయై యేడ్చుచు నున్న యాచిన్నదాని యేడుపు విని సహజకృపాళుండగు నారాజు డెందంబున దొడమిన కనికరంబు పైకి దోపనీయక చాలా చాలు. నీ నీతివాక్యముల కేమిలే ? లోకములో స్త్రీలే దుర్మార్గమతులు వారిలో నీవంటివారు మరియును దురితాత్ములు. అట్టి వారియెడఁ గనికరము చేయుట లోకంబున కపకారము సేతుగా భావింతురు. ఒకవేళ నిప్పుడు చెప్పు నీతివాక్యములు విని నిన్ను విడిచినచో నీబుద్ధి చక్కబడునా ? పాములకుఁ బాలుపోయుట విషవృద్ధికేగదా ! నిన్ను విడువను అయినను నీవు చెప్పునది యెద్దియో చెప్పుము. అంకదనుక వ్రేటువేయను కత్తివాల్చక యిట్లే యుంచెదనని పలికిన నక్కలికి యులుకుచు దయారస మతనిమది మొలకలెత్తు పలుకుల నిట్లనియె.

ఆర్యపుత్రా! శరణాగతరక్షకత్వమే ప్రధానముగా నెంచు నీ యట్టి పుణ్యాత్ములు పెరవారి గుణాగుణతారతమ్యము గణింతురా? స్త్రీలు వ్యధలుగారని మీరెఱుంగనిదా? ఇప్పుడు నే నేమియన్నను అసత్యముగానే తోచును కోపము సేయక స్వపక్షపరపక్షములు విడిచి యొండు వినుఁడు. ఏ దోషము నెఱుంగక పండితగోష్టితో నంతిపురములోనున్న నన్నుఁ గపటముగావచ్చి చూచి నావ్రతభంగముచేసిన మొదటి తప్పు నాయదియో మీయదియో మాధ్యస్తులై విదారింపుడు. ఎంతయాఁడువారైనను శూరతగల రాచవంగడంబునం బుట్టినవారికి బిమ్మటఁ దత్ప్రతీకారము సేయదలంచుట యెక్కుడు తప్పుగాదని బుద్ధిమంతులకుఁ దోచకమానదు అయినను నధికవిద్యాగుణరూపసంపన్నుఁడగు భూపాలుఁడు వచ్చి వరింప వలదని త్రోయుటయుఁ దప్పనిన నేను యెప్పుకొనియెదను. ఇదియె నాకోపంబునకు బలియైనది. మీ యెడ మున్నెంత క్రౌర్యముగలిగి యుండెనో యిప్పుడంత ప్రీతి జనించుచున్నది. నా విద్యారూపంబులు వృథా చేయకుఁడు. మీయెడ నెప్పుడును నెట్టి ద్రోహమును దలపెట్టను. యదార్థముగా మిమ్ముఁ బెండ్లియాడి మీకు ద్రోహముచేసి కాపురమునకు నీళ్ళుబోసికొన నేనంతచేలనా? యొకవేళ నింతకు మున్నెట్లు చేసితినని యనెదరేమో! మిమ్మాఁ బరిమార్చవలెనని యట్లంటిని గాని మనస్ఫూర్తి వరింపలేదు. నా మాట నమ్ముఁడు. దైవసాక్షిగా మిమ్మే పతిగాఁ జేసికొని యనుకూలవర్తనముల మెలఁగుచు హృదయానంద మాపాదించెదను. మున్నునాయెడఁ బొడమిన మోహం బిప్పుడు తలంచుకొనుడు. యెదిరి మనంబెట్లున్నదో గ్రహించు సామర్ధ్యముగల తిమ్మర్సు నామాటలం గల సత్యాసత్యంబులు దేటపడవా! బాగుగా నిదానింపు డని యత్యాతురముగాఁ బ్రార్ధించుచున్న యవ్వధూటి మాటలు నిక్కములేయని నమ్మి తిమ్మర్సు రాజునకు బోధించి యామె జంపుట మానిపించి యామెకు మరియుం గొన్ని బుద్ధులుగరపి భార్యాభర్త లగుటకు వారిరువుర నొడంబరపించెను.