పుట:కాశీమజిలీకథలు-12.pdf/191

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

కారములుగా ధరించి యెంతయును గౌరవించుచుండెను. వారి నోటినుండి కారిన చొంగ దగిలినను నితరులకు విపత్తు సంభవించుచుండ నిక వారి విక్రమమున వర్ణింపనేల ? లోకములెల్ల దమ సర్వనిధులకు సంరక్షకులుగా నేర్పరచికొనవారి పరార్థనిప్పృ హత్వంబు నేమని గొనియాడగలను ? యోగులవలె వాయుభక్షకులైన వారి యదైన్య ప్రవృత్తి నెంతని గీర్తింతును? వృద్ధులలో వృద్ధుడైన శేషుడే నిజశిరంబున, సగిరి తరుషండ సాగరమహాభరయగు వసుంధరను లీలాకుసుమకళిలివలె ధరించియుండ వారి బల ప్రభావంబేమని చెప్పదగును ?


గీ. ఫణభృతులు సృష్టికదికులై పరగవారి
    సుగుణభంగుల నేమని పొగడఁదగును
    వారి తలఁబుట్టు నస్థిలవంబుగూడఁ
    బ్రస్తుతింగాంచె జగముల రత్నమనఁగ.

విప్రాకారముగనున్న శ్రీహరికి సర్వభూమండలమునుదానము జేసిన సుకృ తమువలననే బలిదానచక్రవర్తికి నాగలోకనివాససౌఖ్యం బబ్బెను. పూర్వము వసుంధ రోద్దరణ నెపమున రసాతలంబునకేగిన వరాహరూపుండగు జనార్దనుం డాలోకమును విడువజాలక యిప్పటికి నందే నివసించియుండెను. కూర్మావతారమున నతండు పాతాళమున కేగి లేక పండాంబువుల నిమగ్ను డై యుండెను. కావుననే యుత్కృష్ట విష్టపాలోకన కుతూహలుండగు వాని కితరలోక నివాసమునకు మనస్కరించినది కాదు.


చ. అతితర సత్తపోనియతినైనఁ గనంగ నశక్యమైన, యా
    యతలనివాససౌఖ్యము సురాధిప భూతగణాధిపాది దే
    వతలకుఁ గల్గలే దచటివస్తువులెల్ల నశేషసృష్టిలో
    నతిరమణీయముల్‌ తరమె యాఫణిలోకవిశేష మెన్నఁగన్‌.

అశేషసుఖసమంచిత మగు నా పాతాళలోకమందు ముంగిట గల ముగ్గు పట్టివలె, గోడమీది చిత్తరువుభాతి, తరుణీమణి మేననున్న యాభరణముగతి, మంజులతా నికుంజమున నున్న పుష్పము విధమున ముల్లోకములకు వన్నె దెచ్చుచు నిందీవర మను నగరముగలదు.


మ. స్తుతి విస్తారమదేల సప్పురమునందున్‌ సారసంసార సం
     భృతి కెల్లన్‌ ఫలమౌ మృగాక్షుల ముఖశ్రీసన్ని వేశంబులన్‌
     సతతామోదగ తాళిపాళిమిషచే స్వర్భానుడిందుభ్రమన్‌
     ప్రతిసంచార మొనర్చు దైవికముగా నబ్బెన్‌ వింధుం డంచటన్‌.