పుట:కాశీమజిలీకథలు-12.pdf/144

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుకలాభము

149

నీ సమక్షమున కేతెంచి నీ యందు సుప్రతిష్టితములై యున్నవి. ఇట్టి నిన్నేమని స్తుతింపగలను ?


మ. ఘనదాన వ్రతతత్పరుండయినన్‌ గార్పణ్యమునంబూని యీ
     వినుతాజాండఘటంబు నీ గుణ లసద్విఖ్యాత మాణిక్య రా
     శిని నిండించి మహానిధానముగ వాసిన్‌గాంచియున్నాఁడ విం
     కను దా వెయ్యది నీ ప్రతాపము వెలుంగన్‌ జ్యోతియై భూవరా.

ఇట్లత్యద్భుతముగ వచించిన చిలుకపలుకుల కానృపసత్తముండలరుచు విస్మయస్మేరాననుండై సమీపవర్తులతో దాని వర్ణనా వైదుష్యమును మాటలపొందికను ప్రగల్ఫవచో వైచిత్ర్యమును బొగడుచు నా చిలుకంగాంచి యిట్లనియె. ఓహో విహం గమప్రవరా ! నీవెవ్వడవు ? ఏ జాతివాడవు ? వస్తువివేకహీనమై వర్ణశూన్యాస్పష్ట శబ్దోచ్చారణ మాత్రకమై యెసగు విహంగమజాతియందు బొడమినను నీ వెట్లుమనుష్య భాష చక్కగా బలుకనేర్చుకొంటివి. శుకజాతి విరుద్ధముగ శిఖవహించిన నీ రూప మక్కజము గొలుపుచున్నదిగదా ! నీ విప్పు డతిచాతుర్యముగ వచించిన స్తుతిపఠన మంతకన్న మిన్నగ వింతగొల్పుచున్నది. మరియును నిస్సంధిరంధ్రోదరంబగు నా చైతన్యమునం దెట్లు ప్రవేశించి పైకి రాగలిగితివి ? అందుండి నీవు పఠించిన పద్య పవృత్త మెట్టిది? వసంతశీలునకు దొరకని నీవు హాలికునిచే నెట్లు పట్టుబడితివని యడుగు నరేంద్రున కా చిలుకనిజవృత్తాంతమిట్లు చెప్పదొడంగెను.

326 వ మజిలీ

చిలుకకథ

దేవా ! అవధారు, సన్యాగిరి పరిసరమున జనసంచార శూన్యంబై మహా మహి దుర్లంబై యతి భయంకరమైన మహారణ్యమొకటి గలదు. అందొక విశాలన్య గ్రోధ తరుకోటరమున నివసించియున్న శుకకుటుంబినికి పిల్లలుపుట్టి చచ్చుచుండుటచే గల్గునెగులు మాన్ఫ నుత్తరవయసునందు నే నుద్భవించితిని. నేనండమునుండి బయట పడీన తోడనే యే హేతువ వలననే శుకజాతి విరుద్ధముగ నీ శిఖ నా తలపై నుదయిం చెను. అట్టి పింఛముతో జాతి విలక్షణముగనున్న నా స్వరూపమును దిలకించి నా జాతి పక్షులేగాక కన్నతల్లికూడ నన్ను పరిత్యజించెను. ఇట్లు పురాకృతకర్మదోషమున గల్గిన కష్టముల ననుభవింపుచు నా యరణ్యమునందే బడియున్న నన్ను శారదియను వనదేవత దయార్థ్రహృదయమై చేపట్టి ప్రతిదినమును నాహారాదికంబొసంగి పోషించు చుండ గ్రమమున నాకు రెక్కలు వచ్చి యెగురుటకు శక్తి గల్గెను. ఈ పింఛముకూడ