పుట:కాశీమజిలీకథలు-12.pdf/140

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పామరుని కథ

145

అప్పుడు నేను వాని యవినయమును సహించుకొని స్వకార్య నిర్వహణ తత్పరుండనై యిట్లని తలంచితిని గ్రామ్యజనుల సహజముగా బొగడికలకు వశ్యు లగుదురు వీనిని మంచిమాటలచేత లోఁబరచుకొని యీ రాత్రియందుఁ సుఖముగాఁ గడపెదను. మరియు నిందుండి యీ శకుంతము నీతఁడేమిచేయునో చూచెదను. ఈ చిలుక వీని కెట్లు లభించెనో తెలిసికొందును. ఏ యుపాయముననైన నీవికిరపరమును వీనివలన సంగ్రహించెదగాక యని నెమ్మనమునఁ గృతనిశ్చయుండనై యందులకుఁ దగినరీతి మాటలాడుచు వాని కానందమొనగూర్చితిని.

ఆ యమాయకుఁడు నాయందుఁ బ్రసన్నుఁడై రాసభాశ్రయోచితమగు నౌచిత్యిమును బ్రదర్శించుచు నందొకమూల గడ్డి చుట్టపై నున్న యన్న పుకుండను గొనివచ్చి యందున్న జొన్నన్నమును పుచ్చకాయకూరతోఁ బెట్టి యుచితరీతిని నా కాతిథ్యగౌరవం బొసంగెను. నాటియుదయమునుండియు నాహారము లేకుండుటచే మిగుల నాకలిగొనియున్న నేనాగోపాలహాలికుండొసగిన భోజనము నమృతమయాహార మట్లు మిగుల నాప్యాయముగ భుజించి వాని యనుమతమునఁ జేరువనున్న నవకలమ పలాలమృదుతల్పమున విశ్రమించితిని. పామరుండును నావలెనే భుజించి నా సమీప మందలి వేఱొక గడ్డిపరుపుమీదనుపవిష్టుఁడై చిలుకకు పంజరము గట్ట నారంభించెను. అప్పుడు నేను సమయము దొరికినదని‌ యుబ్బుచు నుచితవచనముల వాని కిట్లంటిని.

ఓహో ! కృషీవలకులతిలకా ? మీరు నివసించుగ్రామ మెయ్యది ? తమ నామధేయమేమి ? ఈ చిలుక మీ కెచ్చట యెట్లుదొరకెను. దీనినెందులకు సంగ్ర హించితిరి. దీని నెవఁడైన శ్రీమంతున కుపాయనముగ నొసంగదలంచితిరాయేమి ? అయ్యా ! మీకు కోపము గలుగదేని యొకమాట వచించెదను. ఈ చిలుకను నా కొసంగుఁడు. దీనిని మహారాజునకు సమర్పించి మీకు గొప్పయుపకారము జేయించె దను. మీకనల్పమగు భాగ్యమబ్బగలదు. సమానులలో మీకత్యధికమగు గౌరవము గలుగ గలదని వచించితిని. పంజర నిర్మాణము నందే దృష్టి నిల్పియున్న యాపామరుండు నావంకఁ దిలకింపకుండగనే యిట్లు ప్రత్యుత్తరం బొసంగెను.

ధాన్యపారమనుపుర మీ సమీపమునఁ గలదని మీరు వినియే యుందురు. అందు గోపతియను కుటుంబీకుడుగలఁడు. వానికి నేనాత్మజుండను. సంవరకుండను వాడను. కృషీవలుండనగు నేనీపొలములో వరిచేనునూర్చుటకుఁ గళ్ళముచేసి యిందు నివసించుచుంటిని. నేఁడిచ్చటి కనతిదూరముననున్న పొలమునందు సగముగోసి కట్టఁ బడియున్న వరిమోపుల నీకళ్ళమునకు జేర్చబోతిని. అందొకవరికంకెమీద వ్రాలి యున్న యీచిలుకం దిలకించి సహర్షమున దానిసన్నిధికేగి వరిగింజ లొలిచి తిను