పుట:కాశీమజిలీకథలు-12.pdf/136

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని కథ

141

సంతోషస్వాంతుడై కాలము గడపుచుండ సర్వజగదాప్యాయన విశారదయగు శారద సమయం బేతెంచెను.


గీ. అంబుధరపం క్తి విష్ణుపధంబునందు
    వివిధపాండురవర్ణశోభితము నయ్యొ
    వయసుమీరఁగ ధవళభావంబునందు
    వృద్ధునిశిరోజపుంజంబు విధముగాఁగ.

శా. లీనాతిస్థిరమౌ చకోరతరుణీలీలేక్షణాశోణిమ
    శ్రీనింపారెడు బంధుజీవకుసుమశ్రేణిన్‌ ద్విరేఫాంగనన్‌
    ఆనందంబున నూత్న ధాతుపటమందంతర్మషీలి స్తపాం
    ధానుస్యూతకధాక్షరావళివిధంబై విభ్రమించెన్‌ సదా.

అట్టి యుత్కిష్ఠశరత్సమయమం దొకనాడు యుదయమున నాభూజాని నిజాస్థానమండపముం బ్రవేశించివర్ణసింహాసనము నధిష్టించి సుఖోపవిష్టుడై పృధు భరత భగీరధాది పూర్వభూపాలచరితోపనాంసకులగు మంత్రులతోడను, దుర్గిమారాతి నిగ్రహవార్తానివేదకులగు సామంతులతోడను, బాణభట్టాభినందప్రభృతి కవ్కిక్రకలితా వరిష్టగోష్టీవినోదకులగు కవీశ్వరులతోడను, ప్రమాణశాస్త్రోపన్యాస విభ్రమునగు తార్కికులతోడను, పరిహాసమిశ్రితాలాపకౌశలు లగు నర్మసహచరులతోడను నంత డమందానందళితహృదయారవిందుడై యున్న సమయమున, బ్రతీహారి యరుదెంచి జానుకరకమలములు పుడమిసోక మ్రొక్కుచు నిట్లనియె.

దేవా ! ఏలినవారికి మిత్రుడు లీలోద్యానపాలకుడు వసంతశీలుడు దేవర దర్శనార్థియై వచ్చి ద్వారమున నిరీక్షించి యున్నవాడు. ముదలయే యనిన తోడనే యారాజేంద్రుడు మాయానతి నాభీరదేశమందలి నందావటమను పురమునకునుద్యాన పాలకుడుగా బోయి యతండు జిరకాలమున కేతెంచినాడు. సత్వరమ ప్రవేశ పెట్టుమని వాని కానతిచ్చెను. పిమ్మట ప్రతీహారిచే రాజాజ్ఞ నెరింగి వసంతశీలు డతివేగమున స్వామిసన్నిధి కేతెంచి యధార్హ నందనాదికం బొనరించి దా గొనితెచ్చినఫల మొకటి యుపాయనముగ నారేనియెదుట బెట్టెను.

ఆ ఫలము గైకొని “వసంతశీలా ! వచ్చితివా” యని యాదరించు ప్రభు నితో దేవా! అత్యద్భుతమగు విషయము దేవరవారి కెఱింగింప నిచ్చట కేతెంచితి నని యాఱేనిసమీపమున నుపవిష్టుడయ్యెను. పుండరీకుండును రసాంతరతరంగితాంత రంగుడై విశేషమేమో సత్వరమ వచింపుమని యనుటతోడనే వసంతశీలు డిట్లని చెప్పదొడంగెను.

ప్రభువరా ! వసుంధరారమాదేవికి నూతనశృంగార మాపాదించు శరత్కాల మేతెంచినతోడనే దేవరయానతి నౌదలంబూని నవోద్యానకార్యతప్పరుండనై నందావట