పుట:కాశీమజిలీకథలు-06.pdf/321

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

గను. ఆ కవివరుండు సంవత్సరము నుండి మౌనవ్రతము బూనియున్నవాఁడు. సత్కరింపఁదగిన పాత్రుఁడని చెప్పినవిని బోజుండు అయ్యో ? ఇంత సేపేమిటికిఁ జెఫ్పితివి కావు. వేగము రప్పింపుమని యానతిచ్చెను.

అప్పుడు ద్వారపాలురతో నాచావడిలో నున్న వానిని పిలువుఁడని చెప్పెను. వారువోయి యతనిం గేకలు వైచిరి. కుంభుండు తడ వగుటయుఁ గూర్చుండలేక యా చెరుకు ముక్కలకట్టఁ దలక్రింద నిడుకొని పండుకొని నిద్రపోయెను. అక్కడఁ దిరిగెడు కూలివాం డ్రెవ్వరో యతని తలక్రిందమూట యేదియో యనుకొని సగముకాలి యందందుఁ బడియున్నఁ జిదుకుల నేరితెచ్చి యవి మూటగట్టి యతని తలక్రింద నిడి యాయిక్షు ఖండముల లాగికొనిరి. ఆ వ్యత్యాస మేమియు నతండు గ్రహింపక ద్వారపాలురు పిలిచినతోడనే కన్నులు నులిమి కొనుచు లేచి యా సభలోని కరిగెను.

ఆ కుంభుం జూచి రాజు గొప్ప పండితుఁ డితఁడేనా యని యడిగెను. కాళిదాసు అవును అనిపలికి అయ్యా ! తమ రందుఁ గూర్చుండుఁడు అని సంజ్ఞజేసెనుఁ కుంభుండు తాను దెచ్చిన మూటవిప్పి యా చితుగులు బల్ల మీద నిడియె. ఆ కట్టెముక్కలుఁ జూచి బోజుండిది యెక్కడి సాంప్రదాయమో తెలియదు ? ఇందుల కేమి చెప్పునో యని యాలోచించుచుండెను. కుంభుండా బొగ్గు కట్టెలం జూచి యవి యెట్లు వచ్చెనో తెలియక యిఁక తనపని పట్టుదురని పరితపించుచుండెను. కాశిదాసు. వానిం జూచివీఁడీబొగ్గులఁ దెచ్చెనేమి పాపము? దీనికెట్లు సమాధానము చెప్పుదవని వితర్కించుచుండెను.

అప్పుడు బోజుండు కాళిదాసుతో కవీంద్రా ! మీ పండితుండు బొగ్గులను దెచ్చె. నిది యెక్కడి యాచారము అని యడిగినఁ గాళిదాసు ఇది చాలా గూడాభిప్రాయము. మహాకవుల కల్పనలు దురవగాహములు కదా. ఇతండీ బొగ్గుకర్రలఁ దెచ్చిన కారణమెరింగించెద వినుండు. అని యీ క్రింది స్లోకమును జదివెను.

శ్లో. దగ్ధం ఖాండవ మర్జునేనతు వృధా దివ్యద్రుమై ర్భూషితం
    దగ్దా వాయుసుతేన హేమరచితా లంకా వృధా స్వర్గభూః
    దగ్ద సర్వసుఖాస్పదశ్చమదనో హా ! హా ! వృధా శంభూనా
    దారిద్ర్యం జనతాపకం భువి పునఃకేనాపి నోద్యహ్యతే.