పుట:కాశీమజిలీకథలు-06.pdf/300

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(39)

చంద్రముఖి కథ

305

రము భూమినే జనించుచున్నది. ఖనిజమగుట దేవతలు నిక్కడనుండియే కనకమును దీసికొని పోవుచుందురు. మేరుగిరిని గనకాద్రి యండ్రుగాని యందలి పుత్తడి యిత్తడివంటిది. ఖనిజమే శ్రేష్టమైనది. మా దేశములో గనులు పెక్కులు గలవు. అందుమూలమున నింతగాఁ దీసికొని వచ్చితినని యతనిమాటల కేవియో ప్రత్యుత్తరములు చెప్పి సగౌరవముగా ననిపెను. బోజునికి బండ్లు దొరకక నొక చోటను జోటు జాలక యొకచోటను బంగారము రాసులుగాఁ బడి యున్నది. అంతట స్వయంవర ముహూర్త మాసన్నమైనంత బోజుండు లీలావతితోగూడ నా సభకరిగెను. లీలావతి వెనుకటి రీతిని స్త్రీ పుం వివక్షత తెలియని వేషముతో బోజుని పజ్జఁ గూర్చుండెను.

బోజకుమారుని జూచి యందున్న రాజపుత్రు లందరు జంద్రముఖి యతనినే వరించునని నిశ్చయించుకొని యుండిరి. సఖీపరివృతయై చంద్రముఖి పుష్పదామంబు చేతంబూని సింహాసన శ్రేణుల నడుమఁ దిరుగుచు నీ క్రిందిశ్లోకము ప పత్రికపై వ్రాయించి వారికి జూపుచుండునది.

శ్లో॥ యది జనాసి బ్రూహి త్వం కి మాసీ ద్భైరవాలయే.

భైరవాలయమున నేమి జరిగినదియో నీ వెరింగి యుంటివేని చెప్పుము - అని యున్న శ్లోకమును జదివికొని యేమి జరి‌గినదియో యెరుగని వారగుట రాజపుత్రు తెల్ల తెల్లపోవుచు నూరకుండిరి. కొందరు తమకుఁ దోచిన విషయము లేదియో వ్రాసి యిచ్చిరి. అట్లు రాజపుత్రులఁ బరీక్షించుకొనుచు వచ్చి వచ్చి యచ్చిగురుబోణి తటాలున బోజకుమారుం జూచినది. మోహావేశముతో అయ్యో ? నే నీ నియమ మేటికిఁ బట్టితినోకదా ? ఈ యంకిలి లేనిచో‌ నిప్పుడే యిప్పూదండ వీని మెడలోనే వేయుభాగ్యము పట్టును. అయ్యారే ? ఈ రాజపుత్రులలో నితఁ డొక్కడే నా మదికి నచ్చియున్నవాడు. సౌందర్య మన నిట్లుండవలయును. వీని యవయవము లన్నియు మొలచినట్లు పోసినట్లు దిద్దినట్లున్న వికదా ? ప్రాయమునకుఁదగిన రూపము రూపమునకుఁ దగిన తేజము వీనియం దొప్పుచున్నవి. ఈతఁడే వల్లభు డైనచో రతివల్లభుని దాసుఁగా నేలక పోవుదునా ? అట్టియోగము నాకుఁబట్టదు. నా ప్రశ్న మీతని కెట్లు తెలియగలదు ? ఇప్పుడు మార్చికొనిన లోకాపవాదము పొందుదునని తలంచుచు జేటికచే దనప్రశ్న శ్లోకమతని కిప్పించినది.

భోజుం డా పద్యముఁ జదివికొని నవ్వుచు మున్ను లీలావతివలన యా కథ వినియున్నవాడు కావున నిట్లు ప్రత్యుత్తరము వ్రాసెను