పుట:కాశీమజిలీకథలు-06.pdf/292

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(38)

సులోచన కథ

297

అప్పుడు విత్తవర్మ ప్రజ్ఞావంతునికి నపరాధముఁ జెప్పుకొని యొకదివ్య సౌధము వసింప నిచ్చెను. రాధికకు భ్రాంతి వదలినంతఁబది దినములకే యారోగమంతయు వదలినది భార్యమూలమునఁ బ్రజ్ఞావంతుఁడును రాధికయు రాజబోగము లనుభవింపుచుండిరి. కావునఁబిశాచ భ్రాంతి మనోజన్యముఁ దృఢచిత్తుని బాధింప నేరదు అ తేజము పిశాచముకాదు. మీకు వెరపు గలిగినఁ బండుకొనుఁడు. నేనుఁ గాచికొని యుండెదను. అనిచెప్పి వాండ్రు నిద్రించుచుండ రాజపుత్రుండు ఖడ్గపాణియై యా తేజముగురించి వితర్కించుచు మేల్కొనియుండెను అంతలోఁ దెల్లవారినది అప్పుడు బోజుం డాతేజము గనంబడిన కొమ్మ దాపునకుం బోయి విమర్శించి చూచెను. జటాపటలపరివేష్టి శిరస్కుండై యొక కొమ్మనంటి తలక్రిందుగాఁ దపము జేయుచున్న యొక తపస్వి యతనికిఁ గన్నులపండువఁ గావించెను. కర కమలంబులు జోడించి నమస్కరింపుచు నోహో? తపఃప్రభావంబున నీ తాపసోత్తముని దేహంబున దివ్యతేజంబు బయలు వెడలినది. ఈ తేజంబుఁ జూచి మత్కింకరులు కొఱవిదయ్యములని శంకించుకొనిరి. ఈ ముముక్షువు నాతో మాట్టాడి న నావంటియుత్తముఁ డెందును లేడు నేను మిగుల ధన్యుఁడనని తలంచుచున్నంతలో నాజటివరుండు కన్నులం దెరచి యంతర్దృష్టి మాని యందు నిలువంబడి యెదుర వినమ్రుఁడై యున్న బోజకుమారుం జూచి యోహో? నీవెవ్వఁడవు. ఈ దుర్గమ కాలతారమున కేల వచ్చితివి? నీ వృత్తాంతం మెరింగింపుమని యడిగిన బోజుం డిట్లనియె.

మహాత్మా ! నేను ధారానగరాధీశ్వరుండైన సింధులభూపాలుని కుమారుండ. నాపేరు బోజుఁ డందురు. నా బాల్యంబున మా రాజ్యంబు మాతండ్రి ముంజుఁడను తన తమ్ముని యధీనముఁ జేసి స్వర్గస్థుం డయ్యెను. మా పినతండ్రి రాజ్యలోభంబున నన్ను జంపుమని యడవికిఁ బుత్తెంచెను. సదయహృదయులై కింకరులు నన్నుఁ జంపక యెక్కడికేని బోయి బ్రతుకుమని విడిచివైచిరి. జీవులకు జీవితాశకన్నా ప్రియమైనది మరియొకటి లేదుగదా? నేను నగరము విడిచి ప్రాణభయంబున నెందేనిం బారి పోవుచు మార్గముఁ దప్పి యీమహారణ్యములలోఁ బడితిని. ఒకొక్కప్పుడు కీడు మేలునకే కారణమగునని చెప్పిన యార్యోక్తి సత్యమైన దగును. మా పిన తండ్రి కావించిన యపకారము నా కుపకారమైనది. ఇందు దేవర దర్శనమైనది. నా పురా కృత దురితములన్నియు బటాపంచలైనవి. సుకృతములు ఫలించినవి. ఏఁ నిఁక నెక్కడికిం బోఁజాలను. మీ పాదముల నాశ్రయించుకొని యుండెదను. ముక్తి మార్గముపదేశింపుము. ----------- మహర్షులవలె వృక్షశాఖ నవలంబించి తపముఁ జేయుచున్నమీ నామాక్షరముల వినఁ గుతూహలమగుచున్నది. గోప్యము -----యెరిగింపుడని యత్యంత వినయ భయభక్తులతో నడిగిన నాజడధారి యిట్లనియె.

రాజపుత్రా ! నీ యాకార చిహ్నంబులు నీ సుగుణ గౌరవములఁ ------------------- చెప్పినట్లు నీవు మహావైభవముతోఁ బుడమి బాలింపగలవు.