పుట:కాశీమజిలీకథలు-06.pdf/285

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

ఇందు మన సత్వమునకు మిగిలిన సత్వంబు లుండవచ్చును. నేటి రాత్రి యీధాత్రీజము శాఖాంతరమున వసించి గడుపవలయును. ఇకఁబై నము సాగింపవలదని నియమించిన నాకింకరులంగీకరించి విశాలమగు నొక శాఖాంతరాళమున శయ్య నమరించి యతండు పండుకొని నిద్రించుచుండ నిరువురు మేల్కొ ని కాచుచుండిరి. అట్టి సమయమున మీద కొమ్మలసందున నేదియో యద్భుతమైన వెలుంగుగనంబడినది. ఆ కాంతి చూచి యా భటులలో నొకఁడు.-

ఒకఁడు --- ఓరీ! ఆ కాంతి చూచితివా ? ఇందు! గొరవిదయ్యము లున్నవి సుమీ?

రెండవవాడు -- అమ్మయ్యో? ఆమాట నాకేల చెప్పితివి ? నాకు దయ్యమనిన గడు భయము. నే నటు చూడలేను. అది యేమి చేయుచున్నది?

ఒకడు - ఆహా ! నీవెంత పిరికివాడవు? ఈ కత్తి చేతిలో నుండగా నా దయ్యము మనల నేమి చేయగలదు ?

రెండవవాడు -- కత్తులతో వానినేమి చేయగలము ? వానికి రూపము లేదు. కనంబడకుండ వచ్చి మీదబడి ప్రాణములు లాగునని చెప్పుదురు.

ఒకడు -- ఆలాగునా ? ఆ మాట నే నెఱుగను అయ్యో? ఇది మీదబడి మనల జంపును గాబోలు ?

రెండవవాడు - ఇదిగో ? నాకప్పుడే యావేశ మగుచున్నది. ఒడలు వణకు చున్నది చూడుము.

ఒకడు - అక్కటా ! బుద్ధిసాగరుఁ డీరాజపుత్రుని బదిలముగా మేనమామ యిల్లుఁ జేర్చితిమేని మంచికానుక లిప్పింతునని చెప్పుటచే నాస పడి వచ్చితిమి. చచ్చిన తరువాత నీకానుక కేమి చేయుదుము ? ముంజుడా! పాపాత్ముడా? నీ మూలముననే యీ యిక్కట్టు మాకు సంప్రాప్తించును.‌

రెండవవాఁడు - తమ్ముడా నాకు నోటినుండి మాట రాకున్నది. ఆ దయ్యము మీదఁబడి కుత్తుకఁ బట్టుకొన్నది. నీవు బ్రతికియింటి కింబోయితివేని నా భార్యాపుత్రుల గాపాడుచుండవలయుం జుమీ?

ఒకఁడు - ఆ వెలుగు నిక్కడనే యున్నది. అప్పుడే మీదఁబడినదని చెప్పుచుంటివేల? నీకంటె నేనే కొంచెము ధైర్యవంతుఁడఁగదా? ఈ రాజపుత్రుని లేపుదునా ?

రెండవవాఁడు - (గద్గదస్వరముతో) లేపు. లేపు. ఏది యేని బ్రతీకారముఁ జేయగలఁ డేమో?

ఒకఁడు - రాజపుత్రా ! రాజపుత్రా ! (అని వికృతస్వరముతో బిలుచు చున్నాడు)