పుట:కాశీమజిలీకథలు-06.pdf/281

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

రాధించితినని కోరిన నభ్భైరవుం డప్పుడపోయి రెండు గడియలలో నా చేడియం దీసికొని వచ్చి యా కాపాలికుని మ్రోల విడిచి యంతర్హితుం డయ్యెను.

అప్పు డా కాపాలికుం డగ్గి ప్రజ్వరిల్లం జేసి యా చిగురుబోణి కరంబుఁ బట్టికొని “తరుణీమణీ ? నన్ను గరుతు పట్టితివాఁ నాఁడు మీ యింటి కరుదెంచిన కాపాలికుండ. నా యభిలాష వెల్లడించిన భటులచే ద్రోయించితివి కావా? ఇప్పు డేమి చేయదువు? నా చేతం జిక్కితివి నా మహిమ యెరుగక పరిభవించితివి వికఁ నిష్టముతో నన్నుఁ బెండ్లి యాడుము. కన్నులెత్తిచూడుము. ఇది మీ గృహము కాదు. మహారణ్య మధ్యమునందలి భైరవాలయము” అని పలుకుటయు నాకలికి యులికిపడి యోరీ ! దురాత్మా? నా యంతరముఁ దెలియ కేల బలవంత పెట్టెదవు. ప్రాణమైన విడుతునుగాని నిన్నుఁ బెండ్లి యాడనని యా చేడియ ప్రత్యుత్తరముఁ జెప్పుచుండెను. “ఇప్పుడు నీతో బలవంతమునఁ గ్రీడించెద నెవ్వ రడ్డమో చూతుము గాక" యని బెదరించుచు నా కాపాలికుండా పైదలిచేయి విదలించుటయు నచ్చేడియ పెద్ద యెలుంగున నేడువఁ దొడంగినది.

అప్పుడు విగ్రహముచాటున నున్న లీలావతి యంతయుంజూచుచు సమయము వేచి వేచి కరవాలం బుంకించుచు నోరీ? కాపాలికా! అక్రమంబున మంత్రబద్దం జేసి యీ చిగురాకుబోణిని రప్పించి వేధించు చుంటివి. నిన్నుఁ జంపిన దోషంబులేదని పలుకుచుఁ దటాలున వచ్చి కటారి వాని శిరంబు ఖండించి భైరవునికి నై వేద్యముఁ బెట్టినది.

అంతలో భైరవుఁడు ప్రత్యక్షమై మచ్చకంటీ ! నీ సాహసమునకు మెచ్చుకొంటిని. నీ వేదియైనఁ గోరికొను మిచ్చెదనని పలికిన విని లీలావతి యేమియుం గోరక మహత్మా ! ఈ సుందరి నెందుండి తీసికొనివచ్చితివో యచ్చటికిఁ‌ దీసికొని పోయి విడిచి రమ్ము. ఇదియే నాకుఁ బ్రియమని పలికెను.

ఆ వేలు పాపూవుబోణి నప్పుడు భజముపై నిడికొని ముహూర్త కాలములో వెనుకటి మందిరమున శయ్యపైఁ బరుండవెట్టి వచ్చెను. అంతలోఁ దెల్లవారినది. అప్పుడు లీలావతి మెల్లన గుడి వెడలి దేవతా కన్యలజాడ నరయుచు నా ప్రాంతభాగముఁ దిరిగినది. వారెందును గనంబడలేదు. క్రమ్మర గుఱ్ఱమున్న తావునకు వచ్చి తన్నుఁ జూచి సకిలించెడు ఘోటకమును దువ్వుచు నా జవ్వని రివ్వుననెక్కి యత్తురగము నొకదెసకు నడిపించుచుండెను.

కొంతదూరము పోవువరకు నొకచోట నాపాటచ్చరులా వర్తకుని బట్టికొన మొరపెట్టుచుండ మూటఁ జూపుమని చెట్టునకుఁ గట్టి కొట్టుచున్నారు. లీలావతి యవలీల నచ్చటికిఁ బోయి తస్కరులఁ బారఁదోలి యాసార్దవాహుని విడిపించినది. అతండా లీలావతినిఁ బురుషుడఁనుకొని మహాత్మా ! నీవు నాకు బ్రాణదానముఁ