పుట:కాశీమజిలీకథలు-06.pdf/271

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

టకు నీ వెవ్వఁడవు రాజపుత్రుడనని యెరుగవా? యని పలుకుచు వామచరణపాదుకం గైగొని తాలుదేశంబునం గొట్టెను.

అప్పు డాదండనాధుండు రాజపుత్రా ! నే నిట్లు పిలిపించలేదు. రాజశాసన మిదిగోచూడుము. భర్తృదారకుఁడవనియే గౌరవించితినని పలుకుటయు భోజుండు శాసనముఁజూచి ముకుళితనయనాం భోజుండై యొక్కింత తడవుధ్యానించి మంచిదిపోవుదము. పదమని యానతిచ్చి యప్పుడే యా రధమెక్కెను. వత్సరాజు చేత ఖడ్గంబు ధరియించి యతనితోఁగూడ రధమెక్కి భువనేశ్వరీ విపినాభిముఖముగా రథముఁ దోలించెను. అప్పుడు ప్రజలు రాజ్యలోభంబునఁ జేసి పినతండ్రి భోజకుమారుఁ జంపింపఁ బంపుచున్నాఁడని కోలాహలముగా వీధులఁ జెప్పుకొన మొదలు పెట్టిరి. మరియు రాజమార్గముల బౌరులు గుమిగూడి యేమి యేమని యడుగు వారును ముంజున కింతదుర్ణయము కూడదనువారును ఉత్తమ గుణసంపన్నుండైన బోజకుమారుజంపించి ముంజుండు వెండియు రాజ్యముఁ జేయఁగలఁ డాయనువారును, ఇట్టిఘోరకృత్యము రాజు చేయుచుండఁ బ్రజ లూరకొన రాదనువారును, హుం కారములు చేయువారును, బ్రతాపములు పలుకువారునునై నలుదెసలకుఁ బరుగిడుచుండిరి. వీరభటులు గజశాలలకు వాణిశాలలకుంబోయి యల్లరి చేయుచుండిరి. సింధునిపై నభిమానముగల దాసదాసిజనంబు లూరక దుఃఖింపుచుండిరి.

భోజకుమారునితల్లి సావిత్రి దాసీముఖముగా నా వార్తవిని యురముఁ బాదుకొనుచుఁ దండ్రీ ! నీవు నీ పినతండ్రి కేమి యపకారము జేసితివి ? నిష్కారణము నిన్నతం డేమిటికిఁజంపఁ బంపెను. నీ సుగుణంబు లతనికి విపరీతము లయ్యెనా ? అయ్యో ? నే నోచిననోము లన్నియు నిష్పలములగునని యెరుంగను గదా? నీ వెప్పుడో పట్టాభిషిక్తుండ వగుదువని దినములు లెక్క పెట్టుచుంటి. పుత్రా ! నీయాయు వింతలో నంతమైనదియా ? నీకుఁ జక్కనికన్య నరయు చుంటినిగదా ! నాతోఁ జెప్పియైన పోయితివి కావేమి? నన్నును శత్రురాలిగాఁ దలంచితివా? పట్టీ ! నీ తండి నీపైఁ బ్రాణములు వెట్టికొనియే మృతి నొందిరిగదా ? నీ కిట్టిరట్టు గలుగునని కలలోనైనా దలంచనైతినని యనేక ప్రకారముల గురయుంబోలె వా పోవుచుండ వారించుచు నొకదాది అమ్మా ! ఆ మాట సత్యమో యసత్యమో యింకను విచారింపవలయును. ఊరక వీధులవెంబడి చెప్పుకొనుటయే కాని చూచినవారు లేరు. సత్య మెఱింగిన వారొక్కరును జెప్పరని పలుకుచు నూరడించినది. అప్పు డా యిల్లాలు తల్లీ ! చల్లనిమాటలు పలికితివి. నీ మాట సత్యమైనచో మంచికానుక లిప్పింతునుగదా! నీవు వోయి యందలి నిజానిజంబులం దెలిసికొనిరమ్ము. పొమ్ము. నీ రాక వేచియుందునని యాపరిచారికనంపి దైవమున కనేక నమస్కారములు చేయుచున్నది.

అని యెఱింగించి యప్పటికథ ముగించి పై మజిలీయందు మరియు నతండిట్లని చెప్పెను.