పుట:కాశీమజిలీకథలు-06.pdf/253

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

వడువున నడుచువాఁడ నిన్ను నా మంత్రిగా జేసికొనియెద. మా పురమునకురమ్ము. సరోజిని యే కులము లలనయయినను బెండ్లి యాడెదనని శపథముఁ జేయుచున్నాను. అని తన హృదయాశయమంతయు సుముఖుఁడు తెలియఁ జేయుటయు ఘటదత్తుఁ డిట్ల నియె.

నీవు కడు బుద్ధిమంతుండవని సరోజినియే చెప్పినది. మీ యిద్దరింగూర్చి నప్పుడుగదా బ్రహ్మవిన్నాణియని పేరుపొందును. లెమ్ము లెమ్ము ఇంతకు నక్కాంత యేమైనదో చూడవలయును. ఒక్కరిత నక్కానలో విడిచి వచ్చితిని. తెలివిగల దగుటయెట్లో తప్పించుకొని జనపదంబులఁ జేరఁగలదు. క్రూరసత్వంబు లేవియయిన బ్రమాదము గావించిన వేమో? వడిగా బోవలెనని పలుకుచు నతనితోఁ గూడ రెండు దినములలో నా వట పాదము దాపునకుఁ బోయెను. అందు నలుమూలలు వెదకి యడుగుల చిహ్నముఁగాంచి దుఃఖించుచు ఘటదత్తుఁడు హా ? ఇక నేమియున్నది? పదిదినముల క్రిందట నిందు విడిచిపోయి నేఁడు వచ్చి వెదకుచుంటిమి. సరోజిని యెందుఁ గనంబడును ? ఈ మహారణ్యములో దాని తెలివి యేమి యుపయోగించెడిని. కడుపు పగిలి మృతినొంది యుండును. అయ్యో ? కళేబరమైనఁ గనంబడినఁ జూతుముగదా ? కట్టా ! నీ సుగుణములకు సంతసింపక విధి యింత క్రూరుఁ డయ్యె నేమి ? వారకాంతచేఁ బెంపబడిఁ దుర్గుణముల బోధింపఁబడియు దృఢవ్రతయై యుంటివి. తల్లీ ? ఈ జన్మమునకుఁ నిన్నుఁ జూచు భాగ్యము నాకుఁ బట్టునా? ఇదిగో ? నీ భర్త సుముఖుడు నీ నిమిత్తమై విచారించుచున్నవాఁడు, వీని బుద్ధికి మెచ్చుకొంటివిగదా ? వారకాంత యనినందున కెంతయో యభిమానముఁ జెందితిని. నిన్ను దగిన భర్తతోఁ గూర్తునని చేసిన శపధము రిత్త పుచ్చి పరలోకమున కరిగితివా? సుముఖుఁ డిప్పుడు నిన్నుఁ బెండ్లి యాడుట కంగీకరించి యున్నాడు. వేగిరము కనంబడుము. అని యూరక యున్కత్తుండువోలె దఃఖించుచుండ సుముఖుఁడును గన్నీరుఁ గార్చుచు నతని కిట్ల నియె.

మిత్రమా ! నీ విట్లు శోకించుచుండ నా డెందము భేదిల్లుచున్నది. మన యరణ్యరోదనము వినువా రెవ్వరు? సరోజిని బ్రతికియున్న నిన్నిదినము లీ యరణ్యమున నెట్లుండును? జనపదంబులకుఁ బోయి వెదకుదము. ప్రాంత గ్రామముల కరిగి యుండునేమో చూడఁ దగియున్నది. ఇట్లు దుఃఖించుట వీరధర్మమే యని బోధించిన కన్నీరుఁ దుడిచికొనుచు నతండు దాని యడుగులు గురుతులు చూచినంత వంత కలిగినది. స్నేహపాశము కడు చెడ్డదిగదా ? పాప మా పూవుబోఁడి తల్లిని విడిచి నన్నాశ్రయించి తిరుగుచు నా మెంతయో ధైర్యము గరుపుచుండినది. అట్టి దానికొక యుపకారము చేయలేక పోయితిని. అవును ఇన్ని నాళ్ళిందేల యుండును? దాపుననున్న పల్లెల కరుగుదుము. రమ్ము. అని పలుకుచు ధైర్యము