పుట:కాశీమజిలీకథలు-06.pdf/246

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంజరి కథ

251

కౌముదితల్లి లోనికివచ్చి మిక్కిలి దుఃఖించుచుఁ గళావతికి గలుగు సంతతి నెట్లయిన గడతేర్చి రమ్మని మరల బోధించినది.

మంజ - నీ పుత్రిక యా బిడ్డ నేమి చేసినది ?

పాట - వినుమని యప్పడే యిల్లు వెడలి నడివీధింబడి శ్మశాన భూమికిఁ దీసికొని పోవుచున్నదట.

మంజ - తరువాత.

పాట - నడివీధిలో నొక యాబోతు దానిందరుముకొని వచ్చినదట అప్పు డది జడియుచుఁ గాలికొలఁది పారుచుండ నొడిలోనున్న పిల్లజారి నేలబడినది.

మంజ - బళాబళి. తరువాత నేమి జరిగినది ?

పాట - ఆ శిశువును దీసికొనుట కవకాశము దొరికినదికాదట. దానిప్రాణము దక్కించుకొని పారిపోయినది.

మంజ - పిమ్మట నా బాలిక నెవ్వరైన కొనిపోయిరేమో చూచినదా ?

పాట - నా గూఁతురు కొంతసే పాప్రాంతమున దాగికొని గోపల్లభంబు దూరము చనినపిదప మరల నచ్చటికి వచ్చి చూచిన నా పాప కనంబడలేదు.

మంజ - మరియేమైనది ?

పాట - సగము మేమే చంపితిమి. వృషభఖురకోటిఘట్టనంబున మిగిలిన యసువు లూడినంత నా మృత శిశువుం దీసికొనిపోయి తలారులు కందకములోఁ బారవేసియుందురని చెప్పినది.

మంజ - ఆ మాట సందియము కాని నిశ్చయముగాదు.

పాట - ఎట్లయినను మనము చేయవలసినపని చేసితిమిగదా ! నీ వా బాలుఁ నేమి చేసితివి? ‌

మంజ :- కళావతి మగశిశువుం గనినది. వానిని వెంటనే గొంతువునులిమి నా తల్లి చేతి కిచ్చితిని. అది కుండలో నిడికొని యర్దరాత్రంబున స్మశానభూమిమీదుగా నగడ్తయొద్ద కరుగుచుండఁ బిశాచము మీదఁ బడినదఁట. కుండ నేలఁ బారవైచి పారిపోయి వచ్చినది. తరువాత నా బాలుఁ డేమయ్యెనో తెలియదు.

పాట :- సరి. సరి. రెండుక్రియలు‌ నేకరీతిగానే యున్నవి. కళానిలయ నీ కానుక లేమి చేసినది.

మంజ :-- ఎట్టివారికిని మొదటనున్న యాసక్తి తరువాత నుండదు. ఆమెకును దనకూఁతురు సంతతి నిలచి కౌముదిసంతతి నశింపవలయుననిగాదా యభిప్రాయము. అట్లు జరుగలేదు. ఇరువుర కానుకలు సమముగాఁ బంచికొనవలయునని మన యిరువుర మాపనుల సాగించి యిరువురకు దుఃఖప్రదుల మైతిమి. ఇరువురును గానుకలు సున్నఁజుట్టిరి. ఈ సారి మాకుఁ గానుకలు రాఁగలవు. నీ యల్లుఁడు గ్రామాధికారి యగును.

పాట - ఎట్జెట్టూ? వేగము సెప్పుము.