పుట:కాశీమజిలీకథలు-06.pdf/242

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంద్రదత్త కథ

247

గలికీ ! నా మాట నమ్మవుగదా ? సరోజిని సత్రములో నున్న దన్నమాట కల్ల. అతనిబస కరిగిన దేమో వెండియు విచారించెదంగాక యని‌ పలికి నాలుగు దినంబు లావీ డంతయు గాలించి వారప్పురంబున లే్‌రని రాజపుత్రికకు వచ్చి చెప్పినది.

అప్పు డప్పడఁతి మిక్కిలి పరితపించుచు అయ్యో ? యిదియేమి కర్మము ? ఉన్నదాన నుండక లేనిపోని గొడవఁ దెచ్చి పెట్టుకొంటినే ? నాకిది స్వప్నము కాదు గద. అట్ల యిన నీ చిత్రపటము నా చేతికేల వచ్చును ? సరోజిని నన్ను నమ్మించి రాకపోవునా ? పది దినములు నిలువుఁడని చెప్పితినిగదా ? ఇంతలోఁ దమగ్రామము పోయివత్తురేమోయని సమాధానముపడి వాని రూపమె తలంచుకొనుచున్న సమయంబునఁ దల్లి శర్వాణి యరుదెంచి యిట్ల నియె.

పట్టీ ! నీవు కోరినవరుని గురించి నీ తండ్రితో జెప్పితిని. ఆయన వాని పేరు విని విమర్శించి ఛీ ! ఛీ! వాఁడు దొంగలఱేఁడు వానిబట్టి కొనుటకు నాలుగు దేశములు రాజభటులు తిరుగుచున్నారు. మాకుఁ గూడ సమాచార మిదివరకే వచ్చియున్నది. మొన్న వాఁ డిక్కడికి వచ్చియున్నవాఁ డని తెలిసి కాళిందీపుర భర్త ప్రత్యేకముగా వేగుర వీరభటుల నీ యూరికంపెను. వాఁడు కనంబడ లేదు. దొంగతనములో నంత నేర్పరి లేడట. గడియ కొకవేషము వైచుచుండును. కాళిందీపురములో మిగుల భాగ్యవంతురాలగు నొక వెలయాలి యింటికి వెళ్ళి రాజ పుత్రుఁడనని చెప్పి నలుగురు పరిజనులతో లోపలఁ బ్రవేశించి దానిరెక్కలు విరిచికట్టి సొమ్మంతయు దోచికొనివచ్చెనఁట. మఱియు దానికూతుఁగూడ తీసికొని పోయెనట. వాఁడు మన యింద్రదత్త కెట్లు కనంబడెను? చక్రవర్తి కుమారుల దీసికొనివచ్చిన బనికిరారని చెప్పినది కాదా ? ఆ మ్రుచ్చు నెట్లు వరించినది ? పో పొమ్ము. ఎక్కడి వార్తయని‌ పలుకుచు నలుకతో నన్నుఁ దూలనాడిరి.

అని చెప్పిన విని యవ్వనితామణి కన్నుల మూసికొని నిట్టూర్పు నిగుడించుచు నిట్లనియె. అమ్మా ! నేను బాల్యచాపల్యంబున విమర్శింపక తప్పుఁ జేసితిని. ఇప్పు డేమనుకొనినను బ్రయోజనము లేదు. ఇఁక నీ యొద్ద దాచనేల ? నేను వాని సోయగమునకు వలచి భర్తగావరించితిని. సరోజినియే యావార కాంతకూతురై యుండును. దాని మూలముననే నేనీ వలలోఁ బడితిని. అని తాను గావించిన కృత్య మంతయుఁ దల్లి కెఱింగించినది. ఆ కథ విని రాజపత్ని అద్దిదా? ఇంత మాత్రమునకే వాఁడు మగఁడయ్యెనా యేమి? చాలుఁజాలు. దేవుని మెడలో బ్రాహ్మణుని మెడలోఁ బూవుదండలు వేయమా యేమి ? అదియు నట్లే తలంచి చేసినదని సవరించుకొనుమని బోధించిన విని యచ్చెల్వ యిట్ల నియె.

అమ్మా ! సావిత్రి చరిత్ర మించుక తలంచుకొనరాదా ? త్రికరణములలో మనసు ప్రధానమైనది. మనసు చేత వరించుట కంటె గ్రియ యెక్కుడా ? పోనిమ్ము నా భర్త దొంగయే యగుగాక. దొంగ పెండ్లాము దొరసాని యనువాక్య మున్నది