పుట:కాశీమజిలీకథలు-06.pdf/238

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంద్రదత్త కథ

243

దొంగ లాగున యెప్పుడు వచ్చితివి? పల్కరించితివి కావేమని యడిగిన సరోజిని దేవీ! నీ వెద్దియో ముందిడుకొని యభిలాషతోఁ జూచుచుంటివి. నీ యానందమున కంతరాయమగునని మాటాడితినికాను. మిగిలిన దేమియున్నదని పలుకుచు నవ్వినది.

రాజపుత్రీ ? న న్నెక్కసము లాడుటకా ? ఇట్లు వచ్చితివి. పోనిమ్ము నీవు సకలవిద్యా పారంగతురాలవు. నీ యాలోచన సమంజసమై యుండును ఈ పురుషసింహుఁడు నా కనుకూలుఁడని నీకుం దోచినదా ? వీనిం బెండ్లి యాడుమనియెదవా? కులము రూపము విద్యయు మా త్రము వెదకవలసియున్నది. ఈ మూఁడును వీనియం దసాధారణములై యున్నవని నీవ చెప్పితివిగదా ? ధనముతో నాకు నిమిత్తము లేదు. మా తండ్రి రాజ్యమున కాతఁడే నేతయగు నేమి చెప్పెదవని యడిగిన నప్పఁడతి ముసిముసి నగవుతో నిట్లనియె.

తరణీ ! నన్నడిగియే నీ వాతనిమెడలోఁ పూవుదండ వైచితివా యేమి? చేసినపనికి వితర్కము లేమిటికి ? ఇప్పుడు నే వలదన్న మానెదవా ? ప్రత్యక్షముగా నాతనిం జూచితివిగదా ? ఇప్పుడైన నా చిత్రపఠము సత్యమని యొప్పొకొనియెదవా? యని యడిగిన నయ్యువిదచేతులు జోడించి సరోజినీ ! యిదిగో నీకు వందనము లర్పించుచున్న దాన. నీవు వ్రాసిన దంతయు యదధార్థము. అచ్చు గుద్దినట్లే యున్నది. సంతోషమైనది. ఇఁక దాచనేల? తరువాతిపనిగూడ నీవే చేయవలసియున్నది. మా తల్లిదండ్రులతో నాకు నేనై చెప్పుట కులపారికాధర్మము కాదుగదా? ఈ తూరి వారు నన్నుఁ బెండ్లికిఁ బ్రోత్సాహపరచినప్పు డితని వృత్తాంతముఁ జెప్పి యొప్పించెద నంతదనుక నా వీరుఁ డీయూరనుండునట్లు చేయుమిదియె నీవు నాకుఁ జేయదగిన యుపకారమని కోరినది.

సరోజిని దేవీ ! నీ దృష్టిగళంబు నిలతనిపాదంబులకుఁ దగిలికొన్నవి. ఎక్కడికిఁ బోఁగలడు. ఇందే యుండునని యుత్తరము చెప్పి యింతలో వేళ యగుటయు నామె యనుజ్ఞఁ బుచ్చికొని యింటికి వచ్చినది. మొగంబున విన్నదనంబుదోప నేదియో యాలోచించుచున్న ఘటదత్తునింజూచి అన్నా ! నీ‌ మొగ మిట్లున్నదేమి ? నీకు వివాహము నిశ్చయించితిని. నీ కంటె రాజపుత్రిక కెక్కుడు తొందరగా నున్నది ఇఁక పదిదినములకు నీవే యా దేశమునకు రాజగుదువని పలుకుటయుం దలయూచుచు నతండు నిట్టూర్పు నిగుడించి యిట్లనియె

చెలీ ! మన కింకను మంచిదినములు రాలేదు విధివ్యతిరేకుఁడైయుండ మన ప్రయత్నములు కొనసాగునా ? వినుము. కాళిందీపురమునుండి మనల వెదకుచు వేగురు రాజభటు లీపట్టణమున కరుదెంచిరి. వేశ్యాపుత్రికం దీసికొని దొంగ యొకఁడు పారిపోయి వచ్చెను. పట్టియిచ్చినవారికిఁ బారితోషిక మిప్పింతుమని వీధులఁ జాటింపుచున్నారు. నీవు వేశ్యవనియు నేనే దొంగననియు నీ యూరఁ దెలిసినచో మనగౌరవమునకుఁ భంగము కాగలదు. ఈ కళంక మెట్లు పాపికొందుమో