పుట:కాశీమజిలీకథలు-06.pdf/237

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

మొగముఁ జూచుచు నికమనమేమి చేయుదమని యడుగుటయు నామె రాజపుత్రికకై దండఁగొని దేవీ ! ఆవరణ దేవతా విశేషములం జూచివత్తము రారమ్మని పలుకుచుఁ దీసికొని పోయినది. అప్పు డర్చకులను గొందరు పరిచారకులును వెంటఁ బడుటయు రాజపుత్రి వారి కందరకు దలయొక పనిఁ గల్పించి యవ్వలకుం బంపినది.

అత్త రుణు లిరువురు దేవళము చుట్టును దిరిగి యందలి విశేషంబులు చూచు చుండిరి. అప్పుడు సరోజిని దేవీ ! ఇది భైరవాలయమువలె నున్నది. ఇందు మహేశ్వరుని కుమారుం డున్నవాఁడు. ఈతని ప్రభావ మద్భుతమని లోకులు సెప్పుకొను చుందురు. ఈ బలశాలిం జూడక పోయితిమేని దలచినపని నెరవేరదు. చూతము రమ్మని పలుకుచు నక్కలికిచేయి పట్టుకొని గుడితలుపులు తెరచికొని లోపలికిఁ దీసికొని పోయినది. కంతు వసంత జయంతాదుల సోయగము మించి ప్రకాశించుచున్న యా వన్నెకానిం జూచి యా చిగురుబోణి సిగ్గున కగ్గమగు మనసుతో నిలువంబడి యేమి చేయుటకుం దోచక యపాంగ విలోకనముల నతనిం జూచుచు సాత్విక వికారంబులు మేనం బొడసూప మోహవివశయై యేదియో ధ్యానించు చుండెను.

అంతలో నామెను వెదకికొనుచు బరిచారిక లచ్చటికి వచ్చుచుండుటయు జూచి ద్వారదేశమున నిలువంబడి యున్న సరోజిని యింద్రదత్త కత్తెరగు సూచించినది. ఆమెయు నేమియు మాటాడక దేవునికై తెచ్చిన పుష్పదామం బా ఘటదత్తుని కంఠమునవై చి నమస్కరించుచు నీవలకు వచ్చినది. పరిజనులు అమ్మా ! నేడింత జాగుచేసితి వేమిటికి ? వేళ మిగిలినది. ఎరుంగవా ? పోవుదము రమ్మని పలుకుచు నరదము చెంతకుఁ బోయిరి.

రాజపుత్రిక స్యందన మెక్కుచు సరోజినీ ! రేపు వేగము రావలయుం జుమీ ? నీతోఁ బెక్కులు చెప్పవలసి యున్నవని పలుకుచు రధాధిరోహణముఁ గావించి యంతఃపురమున కరిగినది. సరోజినియుఁ ధిరుగ భైరవాలయముదాపునకుం బోయి అన్నా ! ఘటదత్త చీకటి పడుచుచున్నది. పోదము రమ్ము. రాజపుత్రిక యింటి కరిగినదని పిలుచుటయు నతం డతికష్టమున నింద్రదత్తాయత్తమైన చిత్తమును మరలించుకొని యీ వలకు వచ్చి చెల్లీ ! తరువాత నా చిన్నది యేమన్నది ? యనుమతించినదియా ? యని యడిగిన నమ్మగువ నవ్వుచు నేమన్నదియు నీ మెడలోని విరి దండ నడుగుము. అంతయు నదియే చెప్పఁ గలదని యుత్తరముఁ జెప్పినది. పరమ సంతోషముతో వారు నెలవునకుం బోయిరి. మరునాఁ డచ్చేడియ యింద్రదత్త మేడకుం బోయి మేనంబులక లుద్భవిల్ల నా చిత్రఫలకమే చూచుచున్న రాచకన్నియం గాంచి వెరగుపాటుతో నెదుర నిలువం బడినది. పెద్దతడ‌ నమ్ముద్దియ వచ్చినది యెరుగక రాజపుత్రి తన యెదుట ప్రకటించుచు నప్పటంబుఁ గౌగిఁటం జేర్చి ముద్దు పెట్టుకొనుచు సరోజినిం గాంచి సిగ్గుపడుచు దిగ్గునలేచి చిత్రపటము దాచి యోహో ?