పుట:కాశీమజిలీకథలు-06.pdf/235

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

కొని యేమీ ? యిది నిజముగా బ్రతిరూపమే ? కాదు. ఊరక యూహించి వ్రాసితినని తలంచెదను. బుడమి నిట్టిరూపవంతుడే కలిగినచో వేల్పు లందరు వీని పాదసేవఁ జేయఁదగినదియే ? సౌందర్యమన నిట్లుండవలయును. నీ వన్నియు దిద్ది వ్రాసితివి కావున నీ చిత్రమింత చిత్రముగా నున్నది. బ్రహ్మ సృష్టించునప్పుడు ని‌న్ను దగ్గిర నుంచుకొనినచో నిట్టి సుందరపురుషుల నిర్మించుచుందువుగదా ? యని పరిహాస మాడినది.

సరోజిని నవ్వుచుఁ దరుణీ ? నీవు విద్వాంసురాలవుగదా ? ప్రతి రూపమని చెప్పుచు నెక్కువ కల్పించి యెట్లు వ్రాయుదు ననుకొంటివి ? మనుష్యులలో నెంతెంత సుభగు లుండిరనుకొంటివి ? ఈ మహాపురుషుని చరిత్రము కడు నద్భుత మెనది. ఇట్టి దయాశాలి పుడమిలో లేడు. రూపంబునఁగాక పరాక్రమమున నితని ననన్య సామాన్యుఁడని చెప్పనోపునని పొగడుచు అమ్మా ! నేను‌ బోయివచ్చెదను ననుజ్ఞయిమ్ము. కాలాతీతమైనది. సెలవైనచో మరల రేపు వత్తునని పలుకుటయు నింద్ర దత్త యీ చిత్రఫలక మిందుండనిమ్ము. తప్పక రేపు రమ్ము. నీతోఁ గొంత ముచ్చటింపపలసిన పని‌ యున్నదని పలికెను.

సుమతి యను వర్తకుని సత్రములో బసఁ జేసితిమనియు మరల వత్తుననియుం జెప్పి సరోజిని యింటికివచ్చినది. ఘటదత్తుఁ డెదురువోయి చెల్లీ ! ఏమి జరిగినది? కనంబడినదా. మాట్లాడితివా ? అని యడుగుటయు సరోజిని అన్నా ! తొందర పడియెద వేమిటికి ? కనంబడక యెక్కడికిఁ బోవగలదు. మాట్లాడక యేమి చేయును? నీ వనినట్లు దాని రూపము త్రిలోకమోహజనకమై యున్నది. రెండుగడియలు సంభాషించి శిష్యురాలిగాఁ జేసి కొంటినని యచ్చట జరిగినకథ యంతయుం జెప్పినది‌.

అతండు ముప్పిరిగొను సంతోషముతో నెప్పుడు తెల్లవారు నప్పఁడఁతి యెప్పుడుపోవునని గడియ యుగముగా గడుపుచుండెను. మరునాఁడు మరల నత్తరలాక్షి యింద్రదత్త యొద్ద కరిగినది. అప్పుడా చిన్నది యా చిత్రఫలకము వీక్షించు చున్నది. సరోజినిం జూచి యెదురువచ్చి కరగ్రహణముఁ జేసి తోడ్తెచ్చి పీఠంబునం గూర్చుండఁబెట్టి బోఁటీ ! నాకీ మాటఁ జెప్పుము. నీ వితనిఁజూచి వ్రాసితివా ? చూచిన వారు సెప్పగా వ్రాసితివా ? నా కింకను నిట్టి చక్కని పురుషుఁ డున్నాడని నమ్మకము గలుగకున్నది. నీ వా లేఖ్య పాండిత్య మిందుఁ జూపితివని పలికిన నక్కలికి మందహాస భాసుర వదనారవిందమై యిట్ల నియె.

ఇంద్రదత్తా ! నీ కెన్నిమారులు సెప్పవలయును ? అధికముగా వ్రాయ నా కవసర మేమి వచ్చినది ? అతం డీ యూరనే యున్నఁవాడు. వావలసినం జూడవచ్చు. నావుడు మోమింత యెత్తి రెప్ప లప్పగించుచు నితం డీ వీటికి నేమిటికి వచ్చెను? ఏ దేశపు రాజకుమారుండు ? వాని పేరేమి? ఎట్లు చూచుదాననని యత్యుత్సుకముతోఁ బలికినది. అతని కులశీల వృత్తాంతంబులు నా కంతగాఁ దెలియవు. ఒక