పుట:కాశీమజిలీకథలు-06.pdf/227

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నుద్దేశించి రాజపుత్రా ! నీవే యా ముద్రికం దీసితివి వేగముదెచ్చియిమ్మని యడిగినది. ఆ మాట విని యతండు తెల్లతెల్లపోవుచు నన్నల మొగముఁ జూచెను. వారు నీవు తీసితివేని నిజముగా దాచఁగూడదు. మంత్రి పుత్రిక కడు బుద్దిమంతురాలని సంతసింప వలసినదేయని పలుకుటయు నా పింగళాక్షుండు దేవీ ! నీవు నన్ను ముద్రిక తీసితివని పలికితివి. అందులకు నిదర్శన యేమియో చెప్పవలయునని యడిగిన నా సరోజిని రాజపుత్రా ! సూక్ష్మవిషంయంబులు విచారించి బుద్ధిమంతులు దోష విమర్శనము సేయుచుందురు. అందలి కారణంబులు హృదయైక వేద్యంబు లగుచుండును. మా తండ్రి మీలో సుముఖుని బుద్ధిమంతుఁడని చెప్పినట్లే నేనును నిన్ను నిరూపించితిని. అందలి నిజానిజంబులు మీకే విశదముగాఁ గలదని పలికిన సంతసించుచు నతం డిట్లనియె.

దేవీ ! నీ బుద్ధి బలమునకు మిక్కిలి మెచ్చుకొంటిమి. ఆ ముద్రికను నేను దీసినమాట వాస్తవమే. నీ వీ రహస్య మెట్లఁ దెలిసికొంటివో వినవలయునని మిక్కిలి కుతూహలముగా నున్నది. చెప్పుము చెప్పుమని నిర్భంధించి యడిగిన నామె రాజపుత్రా! నే నీ విషయ మెట్లు గ్రహించితినో మీ నలువురు విచారించి చెప్పవలయును చెప్పినవాఁడే బుద్ధిమంతుఁడని పలుకుటయు బద్మనాభ చారుకర్ణ పింగళాక్షులు మువ్వురు విమర్శించి మా కేమియుం దెలియ లేదని చెప్పిరి.

అప్పుడు సుముఖుండు చక్కగా నాలోచించి స్మృతి నభినయించుచు దేవీ ! నీవు చెప్పినకథలో బింగలాక్షుండు దొంగల మంచివారని చెప్పుటచే నతఁడే యీ దొంగతనముఁ గావించెనని యూహించెనని పలికెను. ఆ మాట విని యా బోటి అవును అదియే యధార్థము. ఏ పని చేయువారి కాపని చేయువారిపై దరుచు మనసు వ్యాపించు చుండును. దానంజేసియే నీపింగలాక్షుండు దొంగల మంచివారని నుడివెను. సుముఖుండాసూక్ష్మము గ్రహించెను దానంజేసియే మీతండ్రి సుముఖుండు బుద్దిమంతుడని నుడివెను. మీ రిప్పుడైన నిందులకు సమ్మతింతురా? యని యుపన్యసించిన విని యా రాజపుత్రులు మువ్వురు సిగ్గుపడి యూరకుండిరి.

అప్పుడు చంద్రకేతుఁడు మంత్రిం గౌగలించుకొని నేను నీ బుద్ధిబల మెరింగియే యీ పిల్లవాండ్రకుఁ దెలియుటకై యట్టికట్టడిఁ గావించితి. నీ వొండు నీ పుత్రిక యుండె. వీండ్రకు మంచి బుద్దిఁజెప్పఁ గలిగితిరి. ఒకవేళ నీ వెరింగింపలే కున్నను నిన్నటిపనిఁ జేయింతు ననుకుంటివా? యని యోదార్చుచు నప్పుడే సుముఖుని యువరాజు పట్టాభిషిక్తుఁ జేయుటకు నిశ్చయించెను.

అంతటితో నాసభ ముగించిరి. సరోజిని యందల మెక్కిమంత్రిగారియింటి కరిగినది. అని యెరిగించి మణిసిద్దుం డవ్వలికథ మరల నిట్లు చెప్పుచుండెను.