పుట:కాశీమజిలీకథలు-06.pdf/209

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నేను బడియున్న చెట్టు నీడకు వచ్చి నన్నుఁ జూచి నిలువంబడి యిట్లు సంభాషించుకొనిరి.

ఒకడు -- ఒరేయ్ ! వీనిం జూచితివా ? వీఁడు చచ్చిపడి యుండెనా యేమి?

మరియొకఁడు - లేదు. లేదు. కడుపు కదలుచున్నది. వీనింగడ తేర్చుదుమా ?

వేరొకఁడు - వీని రూపము మిక్కిలి చక్కగా నున్నది. వీఁడిక్కడి కేమిటికి వచ్చెనో తెలిసికొని పిమ్మటఁ గర్తవ్యమాలోచింతము.

ఇంకొకఁడు -- అదియే యుచితము. వీనిం జంపుటవలన మనకేమి లాభము ? కుట్టుకాడలై న లేవుగదా ?

అని మాట్లాడికొనుచు వారిలో నొకఁడు నా మొగముపై నీళ్ళు చల్లెను. అప్పుడు నేనదరిపడి లేచి కూర్చుంటిని. వాండ్రు నన్నుఁజూచి నీ వెవ్వడవు ? ఎందు బోవుచున్నావు? ఈ కారడవి కేమిటి కరుదెంచితివని యడిగిన వారింజూచి భయపడుచు నేనొక బ్రాహ్మణ కుమారుండ. నా పేరు ఘటదత్తుఁ డందురు. అకారణముగా నేను ప్రాణ బంధువులకు విరోధినై విరక్తిజెంది చావవలయునని ఈ యరణ్యంబునం బ్రవేశించితిని. నన్ను మీరు జంపి యవ్వలికిఁ బొండు. ఇదియే నా వృత్తాంతమని చెప్పితిని.

వాండ్రు ముక్కు పై వ్రేలిడికొని ఔరా! మేమంత పాపాత్ముల మనుకొంటివా? మేము రాకున్న దేవుఁడే నిన్నుఁ జంపును. మావలనం బ్రతికితివి. కావున నిన్ను మేము రక్షించెదము. మాతో రమ్ము మేము సెప్పునట్లు వినియెదవేని నీకు మా వృత్తిలో భాగము పంచిపెట్టెదము. మా మాట మీరితియేని గరతేర్పక మానమని పలికిరి. ఎట్టి యిడుములలోనయిన మరణమనిన వెరపుఁ గలుగక మానదు. నా కప్పుడు వేరొక తెరువులేక వారు సెప్పినట్లొప్పుకొనక తీరినది కాదు. నాచేఁ బ్రమాణికము చేయించి తరువాత వారు చోరులమనియుఁ దమతోఁ జౌర్యమునకు రావలయుననియు నది కృష్ణపక్షమగుట గ్రామములమీదికి బోవుచున్నామనియుఁ దమ కథ యంతయుఁ జెప్పిరి. మది నిష్టము లేకున్నను నప్పుడు వాండ్ర ననుసరించి తిఱుగక తప్పినది కాదు. వారిచ్చిన తేనెవలన నాకలియడంచుకొని వారి వెంటఁబడి నడువఁ దొడంగితిని. క్రమంబున నయ్యరణ్యము దాటి జనపద మార్గంబునఁ బ్రవేశించితిమి వాండ్రు నాకుఁ జౌర్యదర్మంబు లన్నియు నుపదేశించిరి. మరియును.

సీ.‌ గట్టి గోడలుమీటి కన్నముల్‌ ద్రవ్వుట
            లంఘించి దాటుట లాఘవమున
    కనులఁ గాటుగఁ బామి కటికి చీకటిలోని
            వస్తువుల్గని పాటవమునఁ గోనుట
    ఎదురైన జనుల భీ తొదవఁ గన్నులదుమ్ము
            పొదవి యవ్వల పారిపోవుటదిమి