పుట:కాశీమజిలీకథలు-06.pdf/202

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘటదత్తుని కథ

207

మునకు దైవికముగా శూలనొప్పి వచ్చుటచే నక్కారణముఁ జెప్పి యప్పుడు వారితో నావీటి కరుగుట మానివేసెను.

వసుంధరుఁడు సముచితపరివార సమేతముగా రాయలవారియొద్ద కరిగి యన్నరపతిచే నర్చితుండై పదిదివసంబు అప్పురంబున వసించి మరల నింటికి వచ్చెను. మరునా డతండు పండుకొనుతల్బంబు తలవైపు యొక పత్రిక గ్రుచ్చఁబడి యున్నది. అది యేమియో యని చదువుటయు నందిట్లున్నది.

మహారాజా ! సకలకళారహస్యవేదివయ్యును రూపవంతుఁడైన ఘటదత్తు నంతఃపురమునకుఁ దీసికొని పోయితివి. శుద్దాంతమునకుఁ బోతుటీగనైన క్షత్రియులు పోవనిత్తురా ? అదియే ప్రమాదము జరిగినది. ఘటదత్తుఁడు కపటవ్యాధిఁ గల్పించుకొని మీతో మొన్నరాక పోవుటకుఁ గారణ మూహించుకొన వలయును. మీరు లేనప్పుడు డతండు నగరికి వచ్చుట తప్పు. అతండు మీయంతవాఁడై యుండ నతనిఁ గాదను వా రెవ్వరు? మీ కత్యంతాప్తుఁడ గావున మీ క్షేమముఁగోరి యిట్లు వ్రాసితిని. తప్పులు మన్నింప వలయును. అట్టి యుత్తరముఁ జదివికొని వసుంధరుఁ డసమాన క్రోధ వివశ మానసుండై కటంబులదర దంతంబులు పటపటం గొరుకుచు నౌరా ? దురాత్మా ? ఘటదత్త? ఎంత కృతఘ్నుండవైతివి. ఇందులకా నీవు నాతో వత్తునని ప్రయాణమై మిషఁబన్ని మానితివి యౌవన మదము యుక్తా యుక్త వివేకము నిలువనీయదు. బ్రాహ్మణుడవై పోతివికాని లేనిచో నిప్పడే నీ శిరంబు నూరువ్రక్కలు సేయింపకపోదునా. అని యనేక ప్రకారముల ఘటదత్తుని నిందించుచుఁ గాలసర్పము భంగి బుస్సురని నిట్టూర్చు నిగుడించుచు శయ్యఁ బొరలుచుఁ గత్తిఁ దీసి మంచము డిగ్గనురికి యంతలో విమర్శించుకొని మరల నయ్యసివరలో నమర్చుచు నీ రీతి రాత్రియల్ల నుల్లము వ్యాకులమంద నిద్రఁజెందక యనేక‌ యూహలు కావించుచుండెను. అంతలోఁ దెల్లవారినది. వాడుక ప్రకారము ఘటదత్తుఁడు వసుంధరుఁడు పండుకొన్న గదిలోనికి వచ్చి యతండు లేవ కుండుటకు శంకించుకొనుచు మెల్ల గా మంచము దాపునకుం బోయి మహారాజా ! నేఁడు సూర్యోదయమైనను లేవకుంటివేమి ? నిత్యకృత్యముల కవసరము మిగులదా యని యడిగిన నతని ధ్వని విని సంవర్తసమయ నిర్ఘాతగర్భ దుర్భరాభ్రఘోషంబు వోలే బొబ్బవెట్టి ఛీ ? ఛీ ? గురుద్రోహీ ? నీ మొగము చూడరాదు. నీవు మహా పాపాత్ముండవు. ఈ క్షణము నా గృహమునుండి నా పురమునుండి నా దేశమునుండి లేచి పోవలయును. అట్లు చేయవేని గడియలో నీ తలఁ గోటగుమ్మమునఁ గట్టఁ యిత్తు. ఇదియే ముమ్మాటికి నాజ్ఞ. అని పలికి పెడమోమువెట్టి యా మంచమునఁ బండుకొనియె.

అప్పుడు ఘటదత్తుఁడు మే నెల్ల నీరై చెమ్మటలుగ్రమ్మ మ్రాన్పడి చేతన నిలుబడి మేను గడగడ వడంక నే మాటయు బలుకుటకు నోరురాక యొక్కింతసేపు నిలువంబడి చిరాలున మరలి లోపలికినిబోక నగరువెడలి రాజమార్గముంబడి ఎక్కడికో పోవుచుండెను. అప్పుడు రాజభటులు తొందరపడుచుఁ