పుట:కాశీమజిలీకథలు-06.pdf/200

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘటదత్తుని కథ

205

కిదియే ఫలము. కడుపునం బుట్టినవాఁ డింతకంటె నధికుండా యేమి? ఏశ్రమయు లేక లభించెను. వీనిం బెంచుకొని కృతార్దురాల నగుదునని యెంతేని సంతసముతో నా బాలు నెత్తికొని ముద్దాడుచు నతిరయంబున నింటికి జని భర్తనులేపి యా పాపంజూపుచు జరిగిన వృత్తాంత మంతయుం జెప్పినది.

ఆ బ్రాహ్మణుఁ డపరిమితానందముఁ జెందుచు నా రహస్యము వెల్లడింపక‌ నప్పుడే భార్యను బుట్టినింటి కనిపి శారద గర్భవతియైనదని ప్రధ గలిగించి తరువాత బుత్రుఁడుదయించెనని వాడుకఁ బుట్టించి కొన్ని మాసములు చనిన పిమ్మటఁ గుమారునితోఁ గూడ భార్య నా పురము దీసికొనివచ్చెను. వానికి ఘటదత్తుఁడనిపేరు పెట్టెను. చక్రవర్తిలక్షణ లక్షితుండఁగు నాబ్రాహ్మణపుత్రుం జూచి‌ జనులు శారద కావించిన పూర్వసుకృతమును గొనుయాడుచుండిరి. ఘటదత్తుని తల్లి తండ్రులు ప్రాణములలోఁ బెట్టుకొని పెంచుచుండిరి. అయిదేండ్ల ప్రాయము వచ్చినది మొదలు వానికిఁ దండ్రి విద్యాభ్యాసము చేయించుచుండెను. తదీయకళాగ్రహణ సామర్ద్యము జూచి యా డింభకుని గారణజన్మునిగాఁ దలంచుచుఁ దండ్రి తగు నుపాధ్యాయుల నియమించి పదియేండ్ల వయసు వచ్చువరకు బహు విద్యలయందుఁ బాండిత్యముఁ గలుగఁ జేసెను. పదియేండ్లలోపల నుపనీతుఁడై యద్భుత విద్యారూప సంపన్నుండై న ఘటదత్తుని ప్రఖ్యాతి లోకులవలన విని వసుంధరుఁ డొకనాఁడు తండ్రితోఁ గూడ నా బాలుని దన యాస్థానమునకు రప్పించుకొని వాని విద్యలం బరీక్షించి వెరగుపడుచు నిట్లు దలంచెను.

అన్ననా! ఇట్టి రూపము విద్యాబుద్దులు తేజంబుఁ గలిగిన బాలుని జక్రవర్తికిఁ బుట్టింపక పేదపారునింటఁ బుట్టించిన బ్రహ్మకంటె నిందాపాత్రుఁ డెవ్వఁడు కలఁడు. కటకటా! ఇరువురు భార్యలు గర్భవతులైనను నాకిట్టి సంతానమును బడయు యోగ్యత లేకపోయినదిగదా? అని యించుక విచారించుచు నతనిఁదొడలపై నిడుకొని ముద్దు పెట్టుకొనుచు అప్పా! నీకుఁ గడమ విద్యలన్నియు నేను చెప్పెద. నా యొద్దఁ జదివెదవా యని యడిగిన నమ్మాణవకుండు భక్తి విశ్వాసములతోఁ జదివెదనను‌ గ్రహింపుఁడని యుత్తరముఁ జెప్పెను. వసుంధరుఁ డదిమొదలు ఘటదత్తుని కుపాధ్యాయుండై తాను గ్రహించిన విద్యలన్నియుం జెప్పుచుండెను. మఱియు నాయుదసాధనము, అశ్వారోహణకౌశలము లోనగు వ్యాయామవిద్యలుకూడ నేర్చించుచుండెను. అయిదారేఁడులలో నతం డఖిలవిద్యా పారంగతుఁడై వసుంధరునికే తప్పులుదిద్దఁ బ్రారంభించెను.

వసుంధరుడు వాని బుద్ధిబలమున కెంతేని వెరగుపడుచు ననుదిన వర్ధమాన ప్రేమలతాదోహల హృదయాల వాలుండై యతనినిఁ బ్రధానమంత్రిగాఁ జేసికొని సంతతము రాజ్యాంగ విషయముల నతనితో ముచ్చటించుచుండెను పెక్కులేల? వసుంధరు డతనిజూడక గడియయైన నోపలేడు, ఆహారశయ్యా విహారాదిక వ్యాపారములు