పుట:కాశీమజిలీకథలు-06.pdf/193

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

అమ్మా ! కళానిలయా ! కులశీలవిద్యారూపసంపన్నుండైన భర్తకుఁ బ్రావాణములలో బ్రాణమై యున్నది. మందారవల్లియు నా యిందీవరాక్షినిం గన్న బిడ్డవలెఁ జూచుకొనుచున్నది. కౌముది కామెపైఁ గల ప్రేమ యిట్టిదని చెప్పఁజాలను. వసుంధరునకుఁ బట్టమహిషియై యా రాజ్యమామెయేపాలించుచున్నది. ఆయన ఇరువుర భార్యలను సమాన ప్రతిపత్తితోఁ జూచుచున్నాఁడు. ఇప్పుడప్పూఁబోణు లిరువురు గర్భవతులైరి. మీకు మనుమఁడుం గలుగఁగలడు. ఆ శుభవార్త మీ కెరింగింప వచ్చితిని. కళావతి కేమియులోపములేదు. ఇంతకన్న మీతో నేమియుఁ జెప్పుమన లేదని యచ్చటికథ యంతయుం జెప్పినది. ఆవార్త విని కళానిలయ యరమురిపెముతో ఏమీ ? ఇరువురును గర్భవంతులైరా ? అట్లయిన నందు నా పట్టి వేడుక చూచువారెవ్వరు ? మందారవల్లి బిడ్డలఁగని యెరుఁగదా? నెల మసలిన పిల్లను బుట్టినింటి కనుపక తనయొద్ద నుంచుకొనునా ? నీకు గడుపునిండఁ గూడు పెట్టినంతనే యూరక దానిం బొగడుచుంటివి. చాలుఁ జాలు అయ్యగారియొద్ద కరిగి మందారవల్లి పెట్టుకష్టములన్నియు నుడువుము. పొమ్మని కొన్నిమాట లుపదేశించి యంపినది.

అది తొలుతఁ తనతల్లియగు పల్లవికయొద్ద కరిగి అమ్మా ! కళానిలయ విద్వాంసురాలైనను సహజమైన క్రూరగుణమును విడచినది కాదు. కళావతి యక్కడ మిక్కిలి సుఖపడుచుండ నయ్యగారితో లేనిపోని నేరములు చెప్పుమని బోధించినది. మరియు వసుంధరుని రెండవభార్య కౌముదికి గర్భస్రావ మగునట్లు చేయుమనుచున్నది. అప్పుడుగాని తనకూఁతు చూలునకు సంతసింపఁడఁట. యీ మాట లన్నియు నీకు జెప్పుమన్నది. నేనీద్రోహకృత్యములఁ జేయఁ జాల. పిమ్మట నీవే యోచించుకొమ్మని చెప్పిన విని పల్లవిక యిట్లనియె.

పుత్రీ ! యజమాను లెట్లు పంచిన నట్లు చేయుట మనకు విధియై యున్నది. అందులకు మంచిచెడ్డల విమర్శింప మనకుఁ బనిలేదు. అమె తండ్రి నన్నామెతో నరణమిచ్చి పంపెను. నిన్నామె కూఁతుతోఁ బంపిరి. తరతరంబుల నుండియు మనము వారి నాశ్రయించుకొనియుంటిమి. మనదేహములు వారి యన్నముతోఁ బెరిగినవి. కావున నామె చెస్పినట్లే‌ చేయవలయునని బోధించి మంజరిక నొప్పించినది. మంజరికయుఁ దరువాత రాయలవారియొద్ద కరిగిన నతం డిట్లనియె.

రాయలు -- మంజరికా ! మన గళావతిని గర్భబరాలసయైనను మందారవల్లి పనులకు నియోగించి నిర్భంధించు చున్నదని చెప్పితివఁట. సత్యమేనా ?

మంజ - చిత్తము. సత్యమే ? భర్తృదారిక రెండుపూటలయందు. నామెకుఁ బాదసంవాహనము గావి౦పక భుజింపదు.

రాయ - అట్లు చేయుట భయముననా? భక్తినా ?