పుట:కాశీమజిలీకథలు-06.pdf/186

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామందకుని కథ

191

యంతఃపురమునకు దీసికొని రమ్మన్నది. వీర సేనుఁడను రాజపుత్రుని ప్రోత్సాహమున మీ‌రిట్లు పోట్లాటకు వచ్చినట్లు తలంచుచున్నాము. ఆ రాజపుత్రుఁడు మా కాంతిసేనను బెండ్లి యాడెదనని చెప్పి చాల చిక్కులు పెట్టెను. అని వారిమీద నేరము మోపి యుక్తిగాఁ జెప్పినది.

ఆ మాటలు వని యావిప్రకుమారుండు ఓహో ? నీ మాటలు మిగుల వింతగా నున్నయవి. కాంతిసేన వారి నందరిని బెండ్లి యాడెదనని చెప్పి విద్యలు లాగి చెఱసాలం బెట్టించినదఁట కాదా? వారందరు కాంతిసేన చాల క్రూరురాలని చెప్పిరి. నీ మాటలచే నట్టిదోష మేమియు గనంబడదు. యెంతయో సన్నాహముతో నా మీదికి వచ్చునని తలంచితిని ఈ మాత్రమునకే యంతగాఁ జెప్పిరి అని యుబ్బుచుఁ బలికిన గేసరిణి యిట్ల నియె.

ఆర్యా ! నీటికొలఁది తామర యనినట్లు మా రాజపుత్రిక క్రూరులకుఁ గ్రౌర్యము జూపక మానదు. టక్కరి టమారీలువచ్చి చేసిన యల్లరికి మేరయున్నదా? వారిని వంచించుట తప్పా? చెప్పుడు. మీవంటివారు‌ యందేలోప మున్నదని కపటము జేసెడిని. అమె యవివాహితయై యింతకాల ముండుటకు మీచెట్టఁ బట్టుటయే ఫలమని యూరక స్తుతియించుటయుఁ గామందకుఁడు వారు చెప్పిన మాటలన్నియు మఱచి యాస్తవము సత్యమని నమ్మి యిట్ల నియె.

చేటీ ! నేను గాంతిసేనను బెండ్లి యాడుట కంగీకరించితిని. ఆమెముందుగా నావిద్య యిమ్మనిన నీయను సుమా ? తొలుతనే చెప్పుచుంటిని. మంగళసూత్రముఁ గట్టిన పిమ్మట నాలోచింతును. ఆ మాట యిష్టమేని చెప్పిరమ్ము లేనిచో నేనొడంబడనని పలికిన నవ్వుచు నది ఆర్యా? మీ కీసందియమేల కలుగవలయును. మీరు భర్తయైనఁ జాలునని మా రాజనందన యానందించుచున్నది. మీ విద్యలు మాకేమియు నవసరము లేదు. మంగళసూత్రముఁ గట్టిన తరువాతనే యీయవచ్చునని పలికి యతని వెంటఁ బెట్టుకుని నగరిలోనికిఁ దీసికొనిపోయి రాజోపచారములు జేయించినది. పెక్కు లేల? ఒకదాసి పుత్రిక నలంకరించియదియే రాజపుత్రికయని చెప్పి యతనికి వివాహముఁగావించిరి. దాని మెడలో మంగళసూత్రము గట్టినతరువాతఁ గాంతిసేన వశ్యురాలై నదని సంతోషించెను.

పిమ్మటఁ బెండ్లి కూతురిచేత గజకర్ణవిద్య తనకిమ్మని యడిగించిరి. పెండ్లి యైనదిగదా? ఇఁక యెక్కడికిఁ బోగలవని యా విద్య భార్యకు ధారవోసెను. అది వెంటనే రాజపుత్రిక కిచ్చినది. శాంబరీ విద్యాబలశూన్యుఁడైన యా కామందకుని బట్టికొని చెఱసాలం బెట్టించినది.

ఆ వార్త గూడచారులవలనఁ దెలిసికొని కరభ శరభ శంతనవీర సేనులు మిక్కిలి పరితపించుచు వానితండ్రి జలంధరునొద్ద కఱిగి నమస్కరించుచు నార్యా ! మీ కుమారునకు గాంతిసేన తగని యవమానముఁ జేసినది. దాసీపుత్రిం బెండ్లిఁజేసి