పుట:కాశీమజిలీకథలు-06.pdf/182

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టక్కరిటమారీ కథ

187

యాడుదును. వారిలో నీకిష్టమైన వాఁడెవ్వఁడో చెప్పుమని యడిగిన నీమాటయే పెద్దగాఁ జెప్పినది. నిన్నుఁ బెండ్లియాడుట కంగీకరించినది. మరివాఁ డిందుల కేమనునో యూహింపుమని చెప్పినవాఁడు నలుదిక్కులుచూచుచు నిట్లనియె. అవును. నీవన్న మాట సత్యమే ఒక్క పడుచు నిద్ద రెట్లు పెండ్లియాడుదురు. ఈ మాట మేము విమర్శించు కొనలేదు. అతం డేమనగలఁడు? రాజపుత్రిక కెవ్వరి యదిష్టమో వానినే పెండ్లియాడ మని చెప్పుము అని బోధించెను ఆ దాది టమారితోఁగూడ నిట్లే చెప్పిన వాఁడును టక్కరి చెప్పినట్లే చెప్పెను

అదియొకనాఁడు వారి నిరువురను నొకరికిఁ దెలియకుండ నొకరి నా రాజపుత్రిక యున్న ప్రాసాదమనకుఁ దీసికొనిపోయి చెరియొక చోటం గూర్చుండఁబెట్టినది. టక్కరికి దెలియలేదని టమారియు టమారికిఁ దెలియలేదని టక్కరియు సంతసించుచుం దా నొక్కరుఁడే అక్కడికి వచ్చితిననియుఁ దానే రాజపుత్రికను బెండ్లి యాడుచున్నాననియు నుబ్బుచుండిరి.

అప్పుడు తొలుత గాంతిసేన జగన్నోహనరూపముతో టక్కరియొద్ద కరుదెంచి యా దాదింజూచి యోసీ ? నీవు పొగడిన పురుషుఁ డితండేనా? నాకు వీనీవలన నోలి యేమి యిప్పించుచున్నావు. నా విద్య వీని కిచ్చుచున్నాను. వీని విద్య నాకిమ్మని చెప్పితివా? అని తళ్కు చూపులు వానిపైఁ బరగించుటయు మోహపరవశుండై యొడలెరుగకయే మాటయాడుటకును నోరురాక యాకన్యకామణికిఁ దనటక్కరి విద్యధారవోసి యింద్రజాలము తనకిమ్మని కోరికొనియెను.

ఇదిగో ? ఇప్పుడే వచ్చుచున్నాము. వివాహమునకు సర్వసిద్ధము చేయింపుమని నుడువుచు టమారియొద్ద కఱిగి వానితోఁగూడ నట్లే పలికి వలపున నొడ లెరుంగకుండఁ జేసి వానివిద్యసైతము ధారవోయించుకొన్నది.

అప్పుడు వాండ్రు పెండ్లి కూతురు మరల దమదెసకు వచ్చునని యాసతో నెదురు చూచుచున్నంతలోఁ గొందరు రాజభటులువచ్చి వారి పాదంబులకు సంకెళులు తగిలించి రెక్కలువిరిచికట్టి చెరసాలలోఁ బెట్టిరి. టక్కరిటమారీలు మాయాబల శూన్యులై బట్టుపడి బందీగృహంబునఁ బెట్టబడిరని విని రావణకుంభకర్ణులవధ విని వేల్పులు సంతసీంచునట్లు భూలోకప్రజ లందరు సంతసించిరి.

కొన్నిదినములైన వెనుక కారాగృహరక్షకుల నెట్లో వంచించి టక్కరిటమారీలు చెఱఁదప్పించుకొని పారిపోయి కుశద్వీపమున కఱిగి రాజపుత్రుంగాంచిరి. వీరసేనుండు వారింజూచి, చోరులారా ! కాంతిసేనం దీసికొని వచ్చితిరా? ఇంతజాగు చేసితిరేల? మిమ్ముఁ జూచి మాచిగురుబోణి వెఱచినదియా? అచ్చటి విశేషములు చెప్పుడని అడిగినవాండ్రు కన్నీరుఁ గార్చుచు నిట్లనిరి. చేత నాయుధములేక శత్రువుల మీదకేగిన బరాభవము రాకపోవునా? మాయాబలశూన్యుల మైతిమి. పోఁజాలమని యెంతఁజెప్పినను వినక బలవంతమున మమ్ముఁ ద్రోచితివిగదా? మనకుపకారముఁ