పుట:కాశీమజిలీకథలు-06.pdf/177

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నీరుదేర నీవలకు రప్పించి తానత్తోయంబుఁ గైకొని యతనియొద్దకుఁబోయి ధారవోయుమని యడిగిన నతం డించుకయు సంశయింపక నా మహేంద్రజాల మా లల నకు జలధారాపూర్వకముగా నిచ్చివేసెను.

కాంతిసేన అప్పుడేయాజాల ముపసంహరించినది. పుష్పవచనము పొధము నంతరించినవి. రాజపుత్రుండు తెల తెల్లపోవుచు నలుదిక్కులు సూచుచున్నంత నంతకుఁ బూర్వమక్కాంతిసేనచే రప్పించియుంచిన రాజభటు లతనిం బట్టుకొని రెక్కలు గట్టి కరభ శరభ శంతనులతోఁగూడ జెఱసాలం బెట్టిరి.

అప్పుడు రాజపుత్రుఁడు అయ్యో ? అయ్యో ? ఎంతమోసముఁ జెందితిని. అది యింద్రజాలమని యించుకయు విచారింపక చెల్లించితినిగదా ? అన్నన్నా ! అది మాయావతియని యెరింగినచో నాకాంతిసేనను గొప్పుఁపట్టి యీడ్చుకొని పోకపోయితినా ? ఆహా ? యేమి నామోహము ? చేత దీప ముండియుఁ జీకటిలోఁ బడిపోయితిని. భార్యయైనదిగదాయని యావిద్య యిచ్చితిని. శంతనా! నీ మాట వింటిని కాను నీ వని నట్లే చేసినది. ఇప్పుడేమి చేయదము. కోరలు తీసిన పాముల మైతిమి. మా తండ్రి కీవార్తఁ జెప్పువారెవ్వరు ? మాకు స్నేహితులు టక్కరిటమారియని యిరువురు దొంగలు కలరు. వారికడ నీమాయ లేమియు నుపయోగింపవు. వారు వచ్చిన మనల విడిపింపఁగలరని దుఃఖించుచున్న వీర సేను నూరడించుచు శంతనుఁ డిట్లనియె.

మిత్రమా ! పాపము నీవు మా నిమిత్తమువచ్చి యాపత్తునొందితివి. పుడమిలో దానిం జయించువారు లేరు. నీతో మేమన్ని యుంజెప్పిన దాని వలలోఁబడి నిక్షేపమువంటి విద్యఁగోలుపోయి వచ్చితివి. నీ టక్కరి టమారీలు వచ్చినను వారి అబ్బలు వచ్చినను నాబింబోకవతిని మోసపుచ్చలేరు. ఇఁక దానిజోలికిఁ బోవద్దు. మనమీ చెఱసాలనుండి తప్పించుకొనిపోవు నుపాయ మరయుము. మన దారిని మనము పోవుదము. మరియు మీ తండ్రికీవార్త దెలియక మానదు. కొందరు మీ పరిచారికులా తోటలోఁ గలరు. వారింబట్టుకొన లేదు. వారుపోయి చెప్పుదురు. అని యాలోచించుకొనుచు నందుఁ గొన్ని దినంబులుండిరి.

అని యెరిగించి అతండవ్వలి కథ మరల నిట్లు చెప్పదొడంగెను.