పుట:కాశీమజిలీకథలు-06.pdf/161

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

విశేషములివియే సుడీ? నన్నుఁ బిలువక నకాలమున నత్తోట కేమిటికిఁ బోయితిరి ? మీ మాటలు వారి యనుమానమును దృఢపరచుచున్నవి అని పలికెను.

ఓహో! మీ రాజ్యములో నిన్ని చిత్రములున్నవియా ? ఎరుఁగక పోయితింగదా ! యనుటయు శంతనుండు నవ్వుచు దేవర యిది మీ రాజ్యమనుచున్నారేమి ? మీరు పరాయివారా? అని ప్రత్యుత్తర మిచ్చెను. రాజు నాలుకఁ గఱచుకొనుచు శంతనా ! మాటవరస కట్లంటి. పోనిమ్ము మంత్రులు నన్నుఁ బరీక్షించుచున్నారుగా ? ఏది యీ రాత్రి మరల నా వింతలం చూపుము. వారిపని రేపు జక్క జేసెదనని యాగ్రహ ముఖుండై పలికెను.

శంతనుఁడు మరల సాయంకాల మా తోటకు దీసికొనిపోయి వెనుకటి విశేషములన్నియుఁ జూపెను. ఆ యోషామణియుఁ గంఠాశ్లేషము జేసికొన్నది. అంతలో కాలాంత మగుటయు శంతనుఁడు వాని నింటికిం దీసికొని వచ్చెను. తనగుట్టు గ్రహించినవారని నప్పుడున్న మంత్రులనెల్ల నుద్యోగమునుండి తొలగించి క్రొత్త వారి నేర్పరచెను. ఆ మంత్రులందరు గమిఁగూడి యాలోచించి రాజు దుర్నీతి యంతయు శంతనుని తమ్ముడు కామందకుని ముఖముగా రాజపత్నికిఁ దెలియఁ జేసిరి. కామందకుఁడు రాజపత్నితో అమ్మా! మన ప్రభువుఁ నాఁడే స్వర్గస్తుఁ డయ్యెను. నీచుం డెవ్వఁడో యా బొందులోఁ బ్రవేశించెను. మిమ్ము గణింపక నొక చిన్నదానిం బెండ్లి యాడుటకు సిద్ధముగా నున్నవాఁడు. వానికిఁ గలిగిన సంతతికే రాజ్యము సంక్రమింప గలదు. ఇప్పుడు మీ‌ కూతురు కాంతిసేనకుఁ బెండ్లి చేయవలసియన్నదిగదా ? ఆ మాట దలపెట్టకఁ దన పెండ్లి కే తొందరపడుచున్నాఁడు. దీనీ కెద్దియేని ప్రతీకార మాలోచింపవలయును. మా యింట నొక బుద్ధిమంతుండు కాపురముండెను. వానితో నాలోచించిన నంతయు జెప్పఁగలడు. అని బోధించి రాజపత్ని నొప్పించి సాయంకాలమున గరభు నచ్చటకిఁ దీసికొని పోయెను,

రాజపత్ని కరభుంబూచి నీ వెవ్వఁడవు? మా రాజుచర్యలు నీ వెట్టు గ్రహించితివి. నీ తెఱం గెరింగింపుమని యడిగినఁ గరభుండు శిరమించుక వంచి వినయము సూచించుచు తన వృత్తాంతమంతయుంజెప్పి యా శరభుఁడే నీ పతి బొందెలోఁ బ్రవేశించెనని నివేదించిన, అట్ల యిన నీవే‌ వాని నుపాయముఁజేసి రాజు బొందెలోనుండి తొలంగునట్టు చేయుము. అని చెప్పినది. అది మొదలు శరభునకు నంతఃపుర పరిచయము కలిగినది. నిత్యముపోయి రాజపుత్రింజూచుచు నుపాయములు సెప్పుచుండును. ఒకనాడు రాజపుత్రిక‌యగు కాంతిసేనను హట్టాత్తుగాఁజూచి కరభుండు పంచశర విద్దహృదయుండై శంతనుతో మిత్రమా! కాంతిసేన నా హృదయ మాకర్షించినది. నీ యెడ నా కేకాంతము లేదుగదా! నీవా తరుణీమణిని నాకు బరిణయముఁ గావింతువేని నా ఇంద్రజాలవిద్య నీకు ధారబోసెద. నీ వట్లు కావింప నాడు నాకు మరణమే శరణ్యము అని మిక్కిలి దీనుండై ప్రార్దించెను.