పుట:కాశీమజిలీకథలు-06.pdf/150

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌశికుని కథ

155

గ్రహించి యట్లానతిచ్చిరి. వారి యాజ్ఞవడువుననే కావింతమని పలికి మగని చేతనే పంచాంగముఁ జూపించి యమ్మరునాఁడే ముహూర్తము నిశ్చయింపఁ జేసినది.

ఆ రాత్రియే తలయంటి పెండ్లి కూతుం జేసి పెండ్లి కొమరునికిని రహస్యముగా దలయంటి యలంకారములుంచి యా రాత్రి యెవ్వరినో నలువురఁ బారులఁ బిలిచి గుడితోఁ బెండ్లిఁ గావించిరి. మంగళసూత్రము గట్టువరకు నే విఘ్నము వచ్చునోయని యా దంపతులు వెఱచుచునే యున్నారు. మూడుముళ్ళు పడినవెంటనే యానందభరితులై తమ్ముఁ గృతకృత్యులుగాఁ దలంచుకొనిరి. ఆ పెండ్లికి దగ్గర చుట్టములనై నను బిలువలేదు. నాలుగవ దివసమునకుఁ గర్థముని యత్తగారువచ్చి యా వృత్తాంతమువిని గుండెలు బాదుకొనుచు నిట్లు కూఁతురుతో సంభాషించిసనది.

తల్లి :- అయ్యో! అయ్యో ! ఇది యేమిపాపము ? ఇన్నినాళ్ళు వెదకి బంగారమువంటి పిల్లను నిర్భాగ్యున కిచ్చితిరేల? ఇది నీ యాలోచనయా ?

కూతురు :- బిగ్గరగా మాట్లాడకుము. ఆయన వాకిటిలో నున్నాఁడు. వినెనేని కోపించును. పిల్లను మా యింటికిఁ బంపడు. లోపమేమి యున్నది? ఇరువురము నాలోచించియే చేసితిమి ?

తల్లి :- వానియం దేగుణముఁ జూచి యిచ్చితివి ? పాయమా ! నలువది యేండ్లు దాటినవి. చదువా సున్న. ధనమెట్టిదో యెరుఁగడు. గుణము విచారింపక దొంగలకు నొజ్జయఁట జూదరులకు విటులకు మొనగాఁడట.

కూతురు :- నీకీ దుర్బోధ యెవ్వరు కావించిరి ఆయన మహా తపశ్శాలి సుమీ? శపింపఁగలఁడు. నోటికి‌ వచ్చినట్లు మాట్లాడుచున్నావు.

తల్లి :- వీనిగురించి యీ గ్రామమంతయు నల్ల కల్లోలముగా జెప్పుకొనుచున్నారు. నీ‌ నోటికి వెఱచి నీయొద్ద నెవ్వరును మాటాడరు వీ డుత్తరదేశముఁలో బరవాసముఁజేసి పెక్కు నీచకార్యములఁ గావించెనట.

కూతురు :- ఆమాట నీతోఁ జెప్పిన గడుసుతొత్తుకొడు కెవ్వఁడో చెప్పుము. జుట్టుపట్టుకొని యడిగెదను. మాకు మంచి సంబంధము వచ్చినదని యీ యూరువా రందరు నేడ్చుచున్నారు. వారి మాటలు నమ్మి మమ్ము మందలించు చున్నావు.

తల్లి :- ఊరివారి నిందించెద వేమిటికి? వారు నీ యైశ్వర్యముఁ జూచి యోర్వలేకపోయిరి కాబోలు? వారి మాట లట్లుంచి నీ యల్లునికిఁ గల యాస్తియేదియో చూపుము.

కూతురు :- ఉన్నదేదియో యన్నది. ఈ ప్రశ్న నీ కేమిటికి?

తల్లి :- వాఁడు మిమ్ము మోసముచేసి రత్నమువంటి పిల్లను హరించెను. అయ్యో? నేనేమి చేయుదును. (అని దఖించుచున్నది )