పుట:కాశీమజిలీకథలు-06.pdf/146

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌశికుని కథ

151

బరిభ్రమించుచు నొకనాఁడు రాతిరికొక యగ్రహారము కరుదెంచి యొక విప్రుని యింటి ముంగిటి తిన్నె పైఁ బండుకొని నిద్రపట్టక తన దరిద్రస్థితిని గురించి చింతించుచుండెను. ఇంతలో నా యింటి గవాక్ష వివరమునుండి యిట్టి సంవాదము వినంబడినది.

బ్రాహ్మణుఁడు :- నాతీ! నీ కూఁతురు సంబంధమును గురించి నీకుఁ పెద్దపెద్ద యాస లున్నవి కాని కొనసాగునవికావు. దేశమంతయుం దిరిగితిని. వత్సరమున కిరువదిమాడ లాదాయము వచ్చువాఁడైన దొరకలేదు. ఏమిచేయుదును ? వానికే యియ్యవలసి వచ్చునేమో తెలియదు

బ్రాహ్మణి :- నా బొందిలోఁ బ్రాణముండగా ఆ నిర్భాగ్యునకు నా పిల్ల నీయను. నే నెరుంగుదును. కానుక లీయవలయునని వెనుకఁ దీయుచున్నారు. నా పుస్తిలైన నమ్మి నా పట్టికి మంచి సంబంధముఁ సేయకమానను. నా మనమఁడు రాజ్యమును బాలింపవలయును.

బ్రాహ్మణుఁడు :- చాలుఁ జాలు. గొంతెమ్మకోరికలు కోరకుము. మన మింత రాజ్యమేలుచుంటిమి. శేషించినది, నీ మనుమఁడు పాలింపగలడు. వివాహ వివాదములు సములకే శోభించునని వినియుండలేదా ?

బ్రాహ్మణి :- దాని యదృష్టము మంచిది. మీ రెరుంగరు. చేతిరేఖలు చుచి మొన్న హయగ్రీవసోమయాజి దీనికిఁ బుట్టువాఁడు చక్రవర్తి యగునని చెప్పెను.

బ్రాహ్మణుఁడు :- బాపురే! ముష్టిబియ్యమున కాసపడి చెప్పిన మాటలు నమ్మి పెద్దపోకలు పోవుచు నన్ను వేపుచున్నావు గదా !

బ్రాహ్మణి :- ఆయన సాముద్రిక శాస్త్రములో గట్టివాఁడు పెక్కు సారులు పరీక్షించి చూచితిని. ఆయన మాటలెప్పుడు పీరుపోలేదు ముష్టి బియ్యపుఁ మాటలు కావు.

బ్రాహ్మణుఁడు :- కాకున్న నీ మనుమఁడు చక్రవర్తి యెట్ల గును? అట్ల యిన నీ‌ కూఁతును క్షత్రియునకుఁ బెండ్లిచేయవలయును. బ్రాహ్మణులు భూమి పాలకులు కారుగదా?

బ్రాహ్మణి :- అదృష్టముండిన నెక్కడ నుండియో యూడిపడును.

బ్రాహ్మణుఁడు :- ఎవ్వఁడేని అఖండతపంబులుఁ గావించి నీ కూతుం బెండ్లియాడుటకు రావలయును.

బ్రాహ్మణి :- సందేహమేల? తప్పక నట్టివాఁడె రాఁగలడు.

బ్రాహ్మణుఁడు :- నా మాట వినుము. అత్యాశకుఁ బోకుము. ఆ ----- కుమారునికే యిత్తము. అతఁడు మనకు సమానుఁడు.

బ్రాహ్మణి :- మీరు పిల్ల దానికుత్తుకఁ గోయఁ దలఁచికొన్నారా యేమి? --------------- యత్తగారిముందర నది కాపురముఁ జేయగలదా?

బ్రాహ్మణుఁడు :- ఆమె నీకంటె గయ్యాళియా యేమి.