పుట:కాశీమజిలీకథలు-06.pdf/143

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

మ్రోల వ్రాలి మహాత్మా! రక్షింపుము. రక్షింపుము. అని వేడికొంటి. కరుణ కటాక్షములు నా పైఁ బరగించుచు నమ్మహర్షి నీ వెవ్వఁడ వేమిటికిట్లుఁజావఁ బ్రయత్నించుచున్నావని యడుగుటయు నా కథ యంతయుం జెప్పితిని.

మూఢుఁడా మోక్షేచ్చ వదలి యస్థిరములై సంపదలకొరకిట్టు చింతించు చున్నావేమి? వినుము. నీవలెనే నేనును సంపదల కాసఁజెంది యిరువదియేండ్లు గురుకులవాసముఁ జేసి యింద్రజాలమను విద్య సంపాదించి భూమి యంతయుం దిరిగి కోట్ల కొలది ధనము ప్రోగుచేసితిని. దానితోఁ దృత్తిఁ బొందక పరకాయ ప్రవేశవిద్య గ్రహింపఁగోరి యీ యరణ్యమునకు వచ్చితిని. ఇక్కడికి మూఁడు యోజనముల దూరములోఁ ద్రికూటమను నగరంబున దీర్ఘ తముండను మహర్షి యున్నవాఁడు. అతని కా విద్య తెలియునని మునులవలన విని యతనియొద్దకు బోయి యెనిమిది వత్సరము లాశ్రయించితిని. అమ్ముని కప్పటికి నా యెడఁ గనికరముఁ గలిగి నీ యబిలాష యేమని యడిగెను. దేవా! నే నింద్రజాలమను విద్య సంపాదించి భాగ్యవంతులలో నధికుఁడనని పేరుబొందితిని. కాని ప్రభుత్వచిహ్నము దానివలన లభించినదికాదు. పరకాయ ప్రవేశ విద్యవలన నట్టిలాభము కలుగునని యా విద్యకొరకు దేవర నాశ్రయించితిని. ఇదియే నా కోరికయని ప్రార్థించితిని.

నా మాటవిని యతండు పక్కున నవ్వుచు ముక్కుపై వ్రేలిడికొని ధనమునఁ దృప్తుండవై రాజ్యమున కాసపడుచుంటివి. అదియును లభించిన పిమ్మటఁ దేలికగాఁ గనంబడును. మనుష్యులు వచ్చిన స్వర్గముతోఁ దృప్తిఁ బొందక రాని నరకమునకై యాసఁ బడుచుందురు. పోనిమ్ము. నీకుఁ బరకాయ ప్రవేశవిద్య యుపదేశించెదను. రాజ్యసుఖము లెట్ల నుభవింపఁ గలవన యడిగిన నే నిట్లంటి.

స్వామీ ! భూమి నే భూమపతియైనను మృతిఁబొందినప్పుడు వాని శరీరములోఁ బ్రవేశించి యా రాజ్య మేలగలను. ఇదియే నా యభిలాషయని చెప్పిన విని యతండు యధాజాతశరీరమే యస్థిరమైయుండ సంపదలమాట చెప్పనేల? ఇంత ప్రయాసపడి బుద్భుదములవంటి రాజ్య సుఖంబులఁ గోరికొనుచున్నావా? నీ యిష్టము. ఆలోచించుకొనుమని యుపదేశించినంత నప్పుడే నా హృదయమున వైరాగ్యవృత్తి జనించినది. ఆ మహాత్ముని పలుకే యుపదేశవాక్యమైనది. రాజ్యాది సంపదల నేవగించుకొని మరల మహామంత్ర ముపదేశముఁబొంది నాటంగోలె యిందుఁ దపం బొనరించుచున్నాడ. మోక్షమార్గము సేవింపఁ దగినది. నీవును లోకవాసన వదలి ముముక్షుఁడవై యుండుమని పెద్దగా బోధించెను. కాని నా మది కుదిరినది కాదు. మహాత్మా ! మీరు సంపదలచే విసిగియున్నవారు. కావున రాజ్యాధిక సుఖంబుల నసహ్యము జనింప వెంటనే విరక్తులైతిరి. నేను సంపదయెట్టిదో యెరుంగనివాఁడను. మీ వలనే కొన్నిదినము లనుభవించి తరువాత విరక్తిఁజెందెద. ముందుగా