పుట:కాశీమజిలీకథలు-06.pdf/140

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(19)

కామగ్రీవుని కథ

145

అప్పుడా కామగ్రీవుఁడు మిగుల సంతిసించుచుఁ దనమూట జిగిలిపయింబెట్టి యాచెంబందికొని కొంచె మవ్వలికిఁ దీసికొనిపోవుచుండ వణుకుచున్న చేతిలోఁ జెంబు నిలువక జారి నేలం బడినది. నీళ్ళు కారిపోయినవి. అందులకు సిగ్గుపడుచున్న యప్పాఱుంజూచి నవ్వుచు నబ్బాలిక తాతగారూ! మీరు పెద్దలుగదా! చెంబు జారినది. పోనిండు. మరల నీళ్ళుతెత్తునా? కలశమిటు తెండని పలుకుటయు నప్పలుకులు చెవులకు ములుకులై సోక నతఁడు పిల్లా! నన్ను తాతగారని పలుమారు పిలుచుచుంటివి. నేనంత పెద్దవాఁడ‌ ననుకొంటివా? ఈనడుమఁ దెలుగు పడుటచే దలనెరసినది. కాని మరియొకటి గాదు అనుడు నాజన్నిగట్టుపట్టి గట్టిగ నవ్వుచు నిట్లనియె. అయ్యా! మీకు నెఱకలు నెరిసినవి. దంతము లూడినవి. వణకు పుట్టినది. దండముజేతికి వచ్చినది. ఇంకను తాతగారనినఁ గోపము చేసెద రేలయని యడిగిన నతం డిట్లనియె బాలామణీ! నీ పలుకులు గడునింపులుగా నున్నవిగదా? నా పండ్లన్నియు గట్టిగా నున్నవి. నడిమిపన్నొక్కటియే యూడినది. అందలి కారణ మానక చెప్పెదను. నేనీ దండము విలాసమునకు ధరించితినిగాని బలహీనమునఁ గాదు. మఱియు నా చేతిలో చెంబు వణకుచేత జారిపడిన దనుకొంటివా?

అయ్యో! కాదు కాదు. పట్టువదలి పడినది. అని యేమెమో సమాధానముఁ జెప్పెను. ఆ మాటలు విని యాకన్నియ పోనిండు. ఎట్లయినను సరియే మీరు కడు బడలితిరి. ఇక్కతంబున విశ్రమింపుఁ డని పలుకుచు నతండు పండుకొనియు౦డఁ దాళవృంతముందెచ్చి విసరు చుండెను. కామగ్రీవుఁ డాచిన్నదాని మొగంబుఁ జూచుచు అయ్యో! నేను దీనింబెండ్లి యాడం దలంచుకొనియుండ నిది నన్నుఁ దాతయని పరిహాసమాడుచున్నది. దీనికెట్లు సమాధానముఁ జెప్పుదును. ఇది కడుగడుసుది. మరియుఁ గొంత ముచ్చటించి హృదయాశయ మెరింగెదంగాక యని తలంచుచు వాల్గంటీ! నీ తండ్రిపేరేమి? ఆహా? నీసుగుణంబులు మిగుల గొనియాడఁదగియున్నవి. నీకు మంచి మగడు రాగలఁడు మీకులశీలంబు లెట్టివని యడిగిన నబ్బాల అయ్యా! నాపేరు సావిత్రి మాతండ్రిపేరు భట్టపాదుడు. సకలశాస్త్రములం జదివినప్రోడ. అని తన వృత్తాంత మంతయుఁ జెప్పినది. అప్పుడతండు నీ తండ్రి పండితుండగుటనా నీ‌కిన్ని యేండ్ల దనుకఁ బెండ్లిఁ జేయకున్నాఁడు? పదియేడ్లు దాటిన క‌న్నియ రజస్వలాతుల్యయని శాస్త్రములు చెప్పుచున్నవి. నీకు మంచి సంబంధమెక్కడను దొరకలేదా యేమి? యని యడిగిన నా సావిత్రి ముసిముసి నగవుతో నాకుఁ బదియేండ్లు దాటలేదు. మీకట్లగుపడుచున్నానని చెప్పినది. ఓహో! నాకుఁ జత్వారము వచ్చిన దనుకొంటివా? సూదిలో దారము గుచ్చఁగలను. పోనిమ్ము. మంచిసంబంధమున్నది. పెండ్లియాడెదవా? అని ---------- యడుగుచుండ సిగ్గుపడుచు నాపడుచు విసనకర్ర నక్కడ విడిచి దిగ్గున లోనికిం బోయినది.