పుట:కాశీమజిలీకథలు-06.pdf/135

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

చూడమని పలికెను. వానింజూచి గురుతుపట్టి సాధు సాధు నాయత్నము సఫలమైనదిగా? నా తలంచిన కార్యము సాద్గుణ్యము నొందినది. నా సఖులందరుఁ జేరికొనిరని పలుకుచు వారి నభిజ్ఞాన పూర్వకముగా నానందింపఁ జేసెను.

అప్పు డందరుం గలసి శశాంకుని నెలవుకుం బోయి సౌధోపరిభాగంబునం గూర్చుండి మరలఁ దమ వృత్తాంత మొండొరులకుం దెలియజేసికొనుచు నిట్లు సంభాషించుకొనిరి.

రూపవతి :- సఖులారా ! ఇప్పుడు మన తండ్రులు నలువురు నిచ్చటికి వచ్చినట్లు తెల్లమైనదిగదా? రేపు వారికి మనము తెలుపుకొన వచ్చునా రాదా! అప్పుడు నా కేమియుం దోచక నట్లు చెప్పించితిని.

శీలవతి :- చాలుఁజాలు నింకనుం దెలుపక యేమిచేయుదము? ఈ పడిన పాటులు చాలవా?

విద్యావతి :- అవశ్యము కనఁబడవలసినదే. ఇందాఁక వారి దైన్యాలాపములు వినఁ జాలజాలివేసినదిగదా ? పాప మా యజ్ఞదత్తుఁ డట్టి శోకమున కర్హుఁడా ?

కళావతి :- మనకు మనమైపోవుట యుక్తిగాదు. ఆ కేసరి నంపి వారి నిక్కడికే రప్పించవలయను.

రూపవతి :- ఆయనకు మన రహస్యములు వెల్లడించినారా ?

కళా :- లేదు. లేదు. ఈ గొడవయేమియు నెరుఁగడు. మనము మగవారనియే యతని యభిప్రాయము.

విద్యావతి :- సత్వవంతుఁ డెరుఁగునా ?

కళా :- వానికిం జెప్పితిమి. మన మాతనిని వరించుట కందరికీ నిష్టమేనా?

రూప :- అది మనయిష్టముకాదు. భగవంతుని యిష్టమే.‌ ఆ కథ యంతయును విని మరల నా మాట యడిగెద వేమిటికి? అతని యిష్టము తెలిసికొనుట లెస్స.

కళా :- విధిలిఖిత మాతఁడు మాత్రము తప్పింపఁగలడా ?

రూపవతి :- అడిగి చూడరాదా ? ఇట్టె వచ్చుచున్నాఁడు.

సత్వవంతుఁడు :- (ప్రవేశించి) నన్నుఁజూచి నవ్వుచున్నా డేమి? మీ రహస్యముల కంతరాయముఁ జేసితినా యేమి?

శీలవతి :- నీకడ రహస్యములు లేవుగా ? మరేమియునులేదు. నీవు మాకుఁ జేసిన యుపకృతికిఁ బ్రతియేమి చేయవలయునని యాలోచించుచుంటిమి.

సత్వ :- మీకు నేనేమి చేసితిని?

శీలవతి :- అరులచేఁ గట్టబడిన నన్ను విడిపించినది మరతునా? అదియునుంగాక మీ తండ్రి రూపవతికి దాహమిచ్చి కాపాడలేదా ? ఇంతకన్న నుపకార మేమి యున్నది?