పుట:కాశీమజిలీకథలు-06.pdf/128

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాయాతురగము కథ

133

అప్పుడు గుప్తవర్మ సత్వవంతుని మొగముఁజూచి మహాబలా! మా వృత్తాంతము విని నీవు పరిహసింతువేమో ? అయినం జెప్పకతీరదా! ఆకర్ణింపుము. శీల కళా విద్యా రూపవతులని పేరుపొందిన మేము నలువురము సఖురాండ్రము. విశాలాపురంబున విద్యాభ్యాసముఁ జేయుచుంటిమి. మాలో శీలవతీ విద్యావతులకుఁ గులాచార ప్రకారము తండ్రులు వివాహముచేయఁ బ్రయత్నించుటయు సమ్మతిలేక దేశాటనము జేయు తలంపుతో నా కన్నెల నూరు దాటించి నదిలోఁబడి మునిఁగిరని కళావతియు రూపవతియుఁజెప్పి యాప్తులనెల్ల గష్టములఁ బాలుజేసిరి. వారిలో శీలవతి యను దాననే నేను. ఇదియే రూపవతి. నేనును విద్యావతియు నాటిరేయిఁ బురుష వేషముల వైచికొని పురము వెడలి యొక యడవి మార్గంబునంబడి తురగా రూడులమై యరుగుచుఁ దెల్లవారువరకుఁ బెద్దదూరము పోయితిమి. అప్పటికిఁ దత్తడులు బడలికఁ జెందుటచే వాని విడచి కాలినడకలనే పయనము సాగించితిమి. సాయంకాలమున కొక యగ్రహారముఁజేరి సోమభట్టారకుఁడను పండితునియింట విద్యాభ్యాస కైతవమున బ్రవేశించి నాపేరు గుప్త వర్మయు విద్యావతిపేరు కృతవర్మయనియుం జెప్పి సఖురాండ్రరాక నిరీక్షించుచుఁ గొన్నిదినములు వసించితిమి అట్లుండ నాతని కూఁతురు కురూపిణియగుటఁ కుదిరినపెండ్లి బెడసిపోవుట నడలుచు మమ్మడిగికొని గురుండు నా కాఁడువేషమువైచి యిదియే పెండ్లి కూతురని చూపి తనపని యెట్లో నెరవేర్చుకొనఁ బాటుపడెను. గాని యది విపరీతమైనది మరియు నా పరిణయ మధ్యంబున మజ్జనకుండు యజ్ఞదత్తుం డక్కడికి విరక్తుండై యరుదెంచుటయు మే మందు నిలువక పారిపోయితిమి.‌

మేమట్లు పోయిపోయి యొకనాఁటి మునిమాపున కొక గ్రామముజేరి యొక యింటి జిగిలిపైఁ బండుకొంటిమి. నడక బడలికచే విద్యావతి గాఢముగా నిద్ర వోయినది నా కదియేమియో నాఁకు కూరుకు రామింజేసి యెద్దియో ద్యానించుచుఁ బండుకొంటిని. నడిరేయి యగుడు తురగము పారిపోవుచున్నది. మరలింపుఁడు మరలింపుఁడు అని యరచుచు నొకఁడు వెనువెంటరా నొక త‌త్తడి యడుగుత్రాళ్ళం ద్రెంచుకొని యా వీధి నతిరయంబునఁ బరుగిడి వచ్చుచుండెను.

నేనా రొదవిని తటాలునలేచి యదలించుచు వారువమున కెదురు వోయితిని. కాని యది నిలచినదికాదు. అప్పుడు గొప్పయలుకఁ దెచ్చుకొని వెన్నంటి పరుగిడ రివ్వున నెగసి దానిపయిం గూర్చుంటి. అయ్యారే! ఏమందును ? అప్పుడది కీలుత్రిప్పిన బొమ్మ వలె నెగసి యతి రయంబునం బారఁదొడంగెను. జీనును వాటము లేకున్నను నాఁ దురగమెక్కు పాటవము గలిగియున్నది. కావున నించుకయుం జంకక బింకముగా దాని నడుముఁ గాళ్ళతో నదిమిపట్టుకొని యట్టిట్టుఁ గదలక