పుట:కాశీమజిలీకథలు-06.pdf/126

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాయాతురగము కథ

131

యున్న గుప్తవర్మ మరల వెనుకకువచ్చి సత్వవంతా ! అందు నిలచితివేల? రమ్ము రమ్ము ప్రొద్దుపోయినదని పిలచెను.

అప్పుడు సత్వవంతుఁడు సంభ్రమముతో వయస్యా యిటురా ! దైవికముగా మద్గురువరుం డిందుఁ గాన్పించినాఁడు అని పిలుచుటయు నతండు సమీపించి‌ యీయన యెవ్వండు; అని యడిగిన నతం డితడే మదీయప్రాణబంధుండు మకరాంకుడు. వీని యనుగ్రహముననే విద్యా చ్త దృక్సంపన్నుఁడనైతిని. అని చెప్పుటయు గుప్తవర్మ ఓహో ! ఆయనదర్శనమె యైనదా ! యని యగ్గడింపుచు అయ్యా ! మా సత్వవంతుఁడు త్రికాలము లందు మిమ్ము స్మరింపనిగడియలు లేదు. ఏ మాటవచ్చినను మీ మాటయే యుదహరింపుచుండెను. మిమ్ముంగదిలో విడిచి వచ్చెనట. అందుకూరక పశ్చాత్తాపముఁ జెందు చుండును. మీ నెలవేదియో యెరుగక పోవుటచే దేశములు తిరుగుచున్నాఁడు అని చెప్పెను.

ఆ మాటలు విని మకరాంకుఁడు అయ్యా ! మా సత్వవంతుఁడను చున్నారు. తమరెవ్వరు? సత్వవంతుఁడు మీ కెట్టిచుట్టము అని యడుగుటయు సత్వవంతుండా గాధ యంతయుఁ జాలయున్నది. నేను చెప్పెద నింటికిఁ బోవుదము రమ్ము. ప్రొద్దు పోవుచున్నది. అని పలికి హస్తగ్రహణము స్మగహణము లేవనెత్తెను. మకరాంకుఁడును దత్సంపర్కంబు మకరాం కాంకములు మోసు లెత్త నుత్సాహముతో లేచి యతని కై దండఁ గొని నడువసాగెను. రెండవదెస గుప్తవర్మ నడుచుచుండెను.

అప్పుడు సత్వవంతుండు గురుఃవరా ! యీతని నిమిత్తమే కదా! శశాంకుడు నన్ను సౌగంధికనగరమునకుఁ బంపెను. రాజపుత్రులనెల్ల విడిచి సౌగంధిక యీతనినికాదె వరించినది ! మీ యందువోలె నీతనియందును సుగుణములు చాలఁ గలిగి యున్నవి. మేముఁ జూచికొనిన గడియ మొదలు నేటిదనుక గడియయైన విడవక కలసి తిరుగుచున్నారము. మిత్రులం గలసికొను తలంపుతో నంతఃపుర‌మునకు వచ్చుచు విడువలేక నన్నిఁ దీసికొనివచ్చెను. నేనును నీవు కనంబడదు వేమో యను నాసతో వచ్చితిని. నామిత్రుఁడు నీమిత్రుఁడే కావున సుహృల్లాభమునకు నీవును సంతసింపఁ దగిన దేయని యతని వృత్తాంతము తా నెరింగినది వక్కానించెను.

పిమ్మట గుప్తవర్మయుఁ బేరెత్తి వయస్యా ! ఈ క్రొత్త‌ చెలికాని వృత్తాంతము నాకును వినవేడుక యగచున్నది ఎరింగింతువే యనుటయు సత్వవంతుఁ డిప్పుడుకాదు. రాత్రి పండుకొని యంతయుం జెప్పుకొందము. ఇతండు మిగుల నొగిలి యున్న వాఁడని పలికెను.

అట్లు వారు మాట్లాడుకొనుచు నింటికిం బోయిరి. చీకటిలోనొకరిమొగ మొగనికిఁ గనంబడమి గురు తెరంగుటకు వీలులేదు. వారి నిమిత్తము వంటఁ జేసికొని పరిజనులు వేచియుండిరి. కావున వెంటనే భోజనములు చేసి సౌధోపరిభాగమునకుం బోయి -------------- గూర్చుండి యిట్లు సంభాషించుకొనిరి.