పుట:కాశీమజిలీకథలు-06.pdf/124

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(17)

శబరదంపతుల కథ

129

జక్కని కూతురు పుట్టుంగదా? దానినే చూపి నా పుత్రిక కన్యాత్వ మెట్లోఁ బాపికొనియిదనులే యని సమాధానముఁ జెప్పెను.

అప్పుడు మా పరిహాసవచనములే కలహములై క్రమంబునఁ బరుషములగుటయు నొండొరుల గట్టిగాఁ దిట్టికొంటిమి. మరల గొంత సేపటికి సమాధానపడి కలిసికొని మఠంబునకుం బోయితిమి. అట్లు గాశీపురంబున విద్యలం జదివి నేను ముందుగనే దేశమునకుం బోయితిని. చక్కనిపిల్లం బెండ్లి యాడితిని. అది కాపురమునకు వచ్చినతోడనే మా యిరువుర మతులు పూర్వస్మృతిలేక చెడిపోయినవి అడవులపాలై పోయితిమి. కొండలలోఁ గాపురముంటిమి పెక్కులేల? అప్పుడతండు తిట్టిన తిట్టంతయు దగిలినది. సిద్దేశ్వరుని కరుణచే నా కుమారుఁడు నట్టివాడేయై సంవత్సరములో విద్యలన్నియుం జదివెను.

మీరు సెప్పిన కథవలన నతండు పరాక్రమశాలియైనట్లు తెల్లమగుచున్నది కదా? మఱియు వెనుకటియెఱుక యించుకయు లేకున్నను మీ దయవలన నీపుణ్యక్షేత్రమునకు వచ్చుట తటస్థించినది. దై వికముగా మేమిరువురము నాసిద్దతీర్దంబునకుఁబోయి స్నానముఁ చేసితిమి. పూర్వవృత్తాంత మంతయు జ్ఞాపకము వచ్చినది. చదివిన విద్యలన్నియుం స్పురించుచున్నవి. రూపములు మారినవి. సంతోషముతో మీయొద్దకు వచ్చితిమి. ఇదియే మావృత్తాంతము. నరేంద్రా ! సిద్దేశ్వరప్రభావమెట్టిదో చూచితిరా ? మేము పరిహాసముగాఁ గోరినవన్నియు జరిగినవి నాకుమారుఁడు -------- దేశములు పాలించుట జూడవలసియున్నది. అని తన కథ యంతయుం జెప్పిన విని శశాంకుం డమృత హృదయంబున మునిఁగినట్లు మురియుచు ముక్కు పై వ్రేలిడికొని యొక్కింత తడవు ధ్యానించి యిట్లనియె.

ఆర్యా ! సర్వకార్యములు భగపంతుఁడే చక్కపెట్టుచుండును. మనమొక్కటియుఁ జేయజాలము. దైవసంకల్పమున కనుగుణ్యములై న బుద్ధులు మనకుఁ బుట్టుచుండును. వాని ననుసరించియే చేయుచుందుము. నాఁడు మీరుకోరినప్రకార మంతయుం జరుగుటకు సందేహములేదు. యజ్ఞదత్తు నేనెఱుగుదును. మీ కోడలు పుట్టియే యున్నది. ఆ వృత్తాంతము ముందుమీకు వివరించెదను.  మీ కుమారుఁడు సత్వవంతుఁ డీవీటనే యున్నవాఁడు. కావున వెదకిరమ్మని పలుకుటయు నాభూసురుండట్టి ప్రయత్నములో ఆపట్టణమంతయుఁ దిఱుగుచుండెను.

అని యెరింగించి యప్పటికిఁ గాలాతీత మగుటయు నతండు తరువాతికథ అవ్వలిమజిలీయం దిట్లుఁజెప్ప మొదలుపెట్టెను.