పుట:కాశీమజిలీకథలు-06.pdf/121

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

గీ. తెలిసికొంటి నీదు నెలవు నేఁడు వయస్య
    గాశిఁ జెంది తుదకుఁ గాశిఁ జెంది
    తిరుఁగుచుంటి నొకత నెరుఁగవేమిటి కింత
    మొదటిచింత గష్టములకు గంత.

ఆ పద్యముఁ జదివికొన్న శశాంకుఁడు ఔరా ! నేను రాజ్యమదాంధుఁడనై తొంటి వృత్తాంత మంతయు మరచితినిగదా ! ఈ పద్యము వ్రాసినది రూపవతియని లిపిచిహ్నములు సెప్పుచున్నవి. అవును. మే మైదేఁడులు దాటెనేనిఁ గాశీపురంబుఁ జేరుకొన నియమముఁ జేసికొంటిమి. నావయస్యు లందరు నీపాటి కావీటి కరిగియుందురు. ఏనును బోవలసినదే. అన్నిగతుల నప్పయనము సమంజసమై యున్నదని తలంచుచు నప్పరివారము సేవింప భిల్లదంపతుల వెంటఁ బెట్టుకొని కొన్ని దినములకు గాశీపురంబున కరిగెను.

సీ. ప్రవహించునేపుర ప్రాంతమం దుత్తర
              వాహినియగుచు దివ్యస్రవంతి
    విశ్వేశ్వరాభిఖ్య వెలయు నెం దభవుండు
              కై వల్య మొసఁగ గంకణముఁ దాల్చి
    రక్షించు నెం దర్దరాత్ర మందై నను
             నన్నపూర్ణాదేవి హస్తభిక్ష
    మణికర్ణి కాతీర్ద మణియాశ్రితాదిత్య
            మణియై యొసంగుఁ గామములనెందు

గీ. నెందుఁ బొలుపొందుడుంఠి విఘ్నేశ్వరుండు
    భైరవుం డెందుఁ దిఱుగుఁ దలారియగుచు
    దండపాణియు బిందుమాధవుఁడు క్షేత్ర
    పాలు రెటనట్టి కాశిపట్టణంబు.

శశాంకుం డప్పుణ్యక్షేత్రంబునఁ బరిజనులతోఁగూడ నాప్తులజాడ నరయుచుఁ గొన్నిదినంబులు వసించి యొకనాఁడు దివ్యరూపసంపన్నులై యరుదెంచిన య క్కిరాత దంపతులంగాంచి విస్మయ రసావేశ వివశ హృదయుండై యిట్లనియె.

పుణ్యాత్ములారా ! మీరంతకుముందు మాతో వచ్చిన శబరిదంపతులని యూహించుచుంటిని. మీ తొంటిరూపులు మారినవేమి? ఉత్తమ బ్రాహ్మణతేజస్సంపన్నులై యొప్పుచుండిరి. మీ రా భిల్లులుకాక వేరొకరా మీ తెరం గెఱిగింపుడని యడిగినఁ గాసరుఁ డిట్లనియె.