పుట:కాశీమజిలీకథలు-06.pdf/120

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శబరదంపతుల కథ

125

వాఁడు కొండికతనము నాటినుండియు వెరపులేక మెకంబుల కెదురుపోయి పారఁదోలు చుండును. విల్లు వంచుటయు నమ్మువేయుటయు వానికిఁ దొలుత సులభముగా నలవడినవి. విద్యయంతయు నొక యేటిలో మకరాంకుఁడను వానివలన నేరుచుకొనియెను. వాఁడే మావాని నింటికడ నుండనీయక పత్తనములని పెత్తనముఁ జేసి తీసికొని పోయెనని యా వృత్తాంత మంతయుం జెప్పెను.

అప్పుడు శశాంకుఁడు మిక్కిలి వెరగుపడుచు అయ్యా ! సత్వవంతు నప్పుడే నీ వెవ్వండవు ? విద్య లెక్కడ గరచితివి ? నీ తెరఁ గెట్టిదని యడుగక పోయితింగదా? మకరాంకుఁడు వానితో మావీటికి వచ్చియే యుండును వానికి నాయునికిఁ దెలియదుగదా? అని యే మేమో ధ్యానించుచుఁ గాసరా ! మీరు నాతో రండు నేనును మీ కుమారునొద్దకే యరుగుచున్నాడ. వానిఁ జూపెదనని పలికి వారితోఁగూడఁ గతిపయ ప్రయాణముల సౌగంధిక నగరమున కరిగెను.

ప్రభాసాగరుఁ డితనిరాక విని సంతసించుచు నెదురుపోయి సపరివారముగాఁ దోడ్కొనిపోయి పెద్దగా నర్చించి తన కతఁడు కావించిన యుపకార ముగ్గడించుచు వేతెరంగులఁ గొనియాడెను. శశాంకుడును నప్పటికిఁ దగినరీతి నభినందించుచు సౌగంధికకుఁ బెండ్లి చేసిరా ? మేయల్లుడేడి ? సత్యవంతుం దెందున్నాడని యడుగుటయు నతం డిట్లనియె.

శశాంకా ! సౌగంధిక కింకనుం బెండ్లి చేయలేదు. గుప్తవర్మయను విప్రకుమారుని వరించుట మీరు వినియే యుందురు. అతనికి సత్వవంతునికి నసామాన్యమైన స్నేహము కలసినది. ఇరువురు నేక దేహమట్ల మెలంగఁ జొచ్చిరి. నేను పెండ్లి ప్రయత్నముఁ జేయఁ గాశీపురంబున కరిగివచ్చి‌ పెండ్లి యాడెదనని యాగుప్తవర్మ చెప్పెను.

గుప్తవర్మ రూపంబున ననవద్యుఁడే కాని పరాక్రమ శూన్యుండగుట నా మది కంత నచ్చియుండలేదు. తరుణులు రూపైకపక్షపాతినులుగదా! నేను పొమ్మని పరిణయం బుపేక్షఁ జేసితిని సత్వవంతుఁడును గుప్తవర్మయుఁ గాశీపురంబున కరిగిరి. ఇంకను రాలేదని యావార్తయంతయుం జెప్పెను.

అప్పుడత డేమి చేయుటకుఁ దోచక యోచించుచున్న సమయంబున నిరువురు దూతలు వచ్చి దేవాఁ మేము దేవరచారులము. మీరిచ్చిన పద్యపటంబు దేశదేశములు త్రిప్పితిమి. ఎవ్వరును దగిన యుత్తరమీయరై రి. కాశీపురంబున వ్యాసమఠంబున నొక చిన్నవాఁ డీపద్యమువిని యొక్కింత తడవు ధ్యానించి కన్నీరుఁ గార్చుచు మరల నీపద్యము వ్రాసియిచ్చి మేము రమ్మని యెంత నిర్బంధించినను బాటింపక పొండు పొండు. ఈ పద్య మెవ్వరు వ్రాసి యిచ్చిరో వారియొద్ద కీపద్యము తీసికొనిపోయి చదువుఁడు. అని తిరస్కరించిన మే మింటికి వచ్చి యందు మిమ్ముఁ గానక యిక్కడి కరుదెంచితిమని పలుకుచు పద్యము చేతి కిచ్చిరి.