పుట:కాశీమజిలీకథలు-06.pdf/119

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

ఈ చిన్నది రూపమునఁగాక విద్యాశీలంబుల వాక్సతిని మీరియున్నది సుమా ? దీనిం బెండ్లి యాడి మా కల ముద్దరింపవలయు నిదియే నా కోరిక యని పలికిన వినయ వినమిత శిరస్కుఁడై యతం డిట్లనియె.

తల్లీ ! మీ యుల్ల ముల వేరొక తెరఁగున తలంపకుఁడు. మీ యానతి వడువున నడచుచుండ. ఈ నడుమ ప్రభాసాగరునికి సహాయముగా సత్వవంతుఁడను దండనాయకు ననిపితిని. అతండు శత్రురాజుల నెల్లఁ గాందిశీకులం గావించెను. దానంజేసి యిప్పుడు రాజులు పెక్కండ్రు మనకు విరోధులైరని వినుకలి కలిగినది మరియు నా సత్వవంతుని బ్రభాసాగరుఁడు తనయొద్ద నునిచికొనఁ దలంచినట్లు వార్త వచ్చినది. వానిం దీసికొనిరా నే నరగుచుంటి. నటనుండి వచ్చిన తరువాత వివాహ నిర్దేశముఁ జేసికొందముగాక. అని పలికిన యామెకు సంతసముఁ గలిగించెను,

అప్పు డామె తారావళి కేదియో సంజ్ఞఁ జేసినది ఆ బాలిక యొక పుష్పమాలిక యెత్తి తత్తరమందు చిత్తముతో శశాంకుని కంఠమున వైచినది. అతం డా దామంబు సవరించుకొనుచు మందహాసముఁ గావించెను. పిమ్మట‌ రాజపత్ని యీ మాటయే పలుమారు సెప్పి తారావళితోఁగూడ శుద్ధాంతమున కరిగినది.

తారావళి యత్తగారితో శశాంకు డాడుదికాని మగవాఁడు కాఁడనియు నాకార చేష్టాస్వరముల లక్షణంబులిట్టున్న వని వాదించిచెప్పిన వెరగందుచు నామె యా విషయము పరీక్షింపఁ జురికయను తనదాది నొకదాని రహస్యముగా నతని వెనువెంటఁ దిరుగునట్లు నియమించినది

శశాంకుఁడును సత్వవంతుం దీసికొనివచ్చు తలంపుతోఁ దగు పరి వారము సేవింప దురగారూడుడై యొకనాఁడు బయలుదేరి సౌగంధిక నగరమున కరుగుచుండెను. దారిలో గిరాతమిధున మెదురుపడి నమస్కరించుటయు గుఱ్ఱమును మెల్లగా నడపించుచు మీరెవ్వరు ? ఏమిటికి వచ్చితిరని యడిగిన వారు వారువముతో నడచుచు ని‌ట్ల నిరి.

అయ్యా మేము కొండవారము. మాకు లేక లేక సత్వవంతుడను బొట్టెడు పుట్టెను. వాని మీరెక్కడికో పంపిరని మాపల్లెవాండ్రువచ్చి చెప్పిరి. వాఁడెన్నఁడును మాకొండదొరియ విడిచి యరిగియెరుఁగడు. తండ్రీ ? వానినేమి చేసితిరి? బ్రతికియుండెనా ? బాబు ! చెప్పుము. అని ధైన్యముతో దుఃఖించిన వారించుచు నతండు గుర్రము నాపి యేమీ ! సత్వవంతుండు మీ కుమారుండా ? బాపురే వానికొరకు శోకించెదరేలఁ అతండు భద్రముగా నున్నవాఁడు. మిక్కిలి యన్నతదశలోనికి రాఁగలడని పలుకుచు వానిపుట్టుకను గురించియు, విద్యను గురించియు బలమును గురించియూ గ్రుచ్చి గ్రుచ్చి యడుగుటయు. నా కిరాతుం డిట్ల నియె

స్వామీ ! నాపేరు కాసరుండు. నాభార్యపేరు పింగళిక. మేమా కొండలలోని కెప్పుడు పోయితిమో చెప్పజాలము. ఈ పిల్లవాఁడు కొండ దొనలోనే జనించెను.