పుట:కాశీమజిలీకథలు-06.pdf/114

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినత కథ

119

ములు సంగీతములు శృంగార రసపూరితములు. తదుభయ రహస్వాదన వివశుఁడు మేఘనాధుండు. అట్టివానికూఁతు రెట్టిరసికురాలుగ నుండనో యూహింపదగియున్నది. మఱియును --

[1]శ్లో. స్వాతంత్ర్యం పితృమందిరే నివసతి ర్యా తోత్సది సంగతిః
    గోష్ఠీ పూరుషసన్నిదా వనియమో వాసో విదేశే తధా
    సంపర్కస్సహ పుంశ్చభీభి రసకృద్వత్తేర్ని జాయాః క్షతిః
    పత్యు ర్వార్దక మీశతుః ప్రవసనం నాళస్య హేతు స్త్రీయాః

వింతరూపము, విద్యయు, గుణములు గలిగియున్న మగండసమర్దుడై తమయింట నుండుటంబట్టి యతనియాజ్ఞకు లోనుగాక స్వతంత్రురాలై నది. దానంజేసి‌ తక్కిన గుణంబులన్నియు నా చిన్నదానిని స్వయముగా నాశ్రయించినవి. వినత సంగీతమనినఁ జెవి కోసుకొనును. నాటకములనినఁ బండువుగాఁ దలంచును. కావ్య ప్రసంగము లుత్సవముగా నెంచును. స్వయముగాఁ బాడగలదు. ఆడగలదు. ప్రసంగింపఁగలదు.

ఒకనాఁడు కృతవర్మ పాడుచుండ గవాక్షమునఁ గూర్చుండి యా చిన్నది విన్నది. కన్నులార నతనిం జూచినది. అప్పుడే కందర్పుఁ డాపడఁతియొడఁ దన తూపులవేపు మాపఁజేసెను. నాటంగోలె నాబోఁటి కన్నము రుచింపదు. నిద్ర పట్టదు. చావడిలో నతనిమాట వినఁబడెనేని చెవియొగ్గి వినును. పలుమారు జాలముమ్రోల కరుగుచుండును.

చ. కిలకిలనవ్వు మోవిఁ బలుగెంటులు దీటు గుచంబు లోరగా
    వెలువడఁ బైటవియు నెరవింతగఁ గేరుమరుల్కొనంగ బె
    ళ్కులుగొనఁజూచి లేనివగలుంగొని మాటికిఁ గుల్కుగోటి చి
    మ్ములు నొనరించు నవ్వెలఁది మోహమనం గనినంత నాతనిన్‌.

ఆ వికారము లన్నియు గ్రహించియుఁ గృతవర్మ యెరుంగని వాఁడుంబోలె మెలంగుచుండెను. ఒకనాడు మేఘనాధుఁడు పరివారముతో నాటకశాల కరిగి నంత నింటిలోఁ గృతవర్మ యొకఁడు మాత్రము చావడిగదిలోఁ గూర్చుండి యేదియో వ్రాయుచుండెను. అట్టిసమయమున వినత వింతచీరఁ గట్టి తలకుఁ బట్టు వైచుకొని యా గదియొద్దకు బోయి తొంగిచూచి -

  1. స్వతంత్రురాలగుటయు, పుట్టినింటనుండుటయు, తరుచుగా యాత్రలకు వుత్సవములకుఁ
    దిరుగుచుండుటయు, పరపురుషులతో గోష్ఠిఁ జ్రేయుటయుఁ బనిలేక పొరుగిళ్ళ కరుగుచుండుటయు,
    జారస్త్రీలతో సహవాసము, తనవృత్తి విడచి యన్యవృత్తి గైకొనుట పెనిమిటి వృద్దుండగుటఁ మగఁడు దేశాంతర మరుగుట లోనగు కారణంబులచే నుత్తమ స్త్రీయైనను చెడక మానదు.