పుట:కాశీమజిలీకథలు-06.pdf/105

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నున్నదని యెరింగి యిప్పనికిఁ బూనుకొన్నదాననని సమాధానముఁజెప్పి యామెను నిరుత్తరం జేసినది రాజపత్ని కమలమాటలకును వైరాగ్యమునకును మిక్కిలి సంతసించుచు నయ్యోగియనుమతి వడసి యింటికిం జని పరిచయమునం గలిగిన ప్రీతిచే వారిరువురుకుఁ బండుకొన మంచములును బరుపులును లోనగు వస్తువులు కొన్ని యంపినది.

చిదంబరయోగి రాత్రులయం దగ్ని ప్రజ్వలిల్లుచుండ వ్యా ఘాజినముపైఁ బండుకొనుచుండును. గమలయు నతనిబాదముల మ్రోలఁ బవ్వళించునది. రాజపత్ని మంచములు పంపిన తరువాత యోగి కమలను మంచముపై శయనింపుమని యాజ్ఞాపించెను. గురుండు క్రిందఁ బరుండ శిష్యురాలెట్లు మంచ మెక్కునని యాక్షేపించినది. ఆ యోగివ్రతవిరుద్దమైనను శిష్యురాలియందుఁగల ప్రీతిచే నాటంగోలెఁ దల్పమునఁ బండుకొనుచుండెను.

స్థూలజంఘ తామ్రకేశుల కథ

స్థూలజంఘుఁడు తామ్రకేశుఁడను నిరువురు విటులు వేశ్యా విత్తములఁ దస్కరించుటచే రాజపురుషలచే నపరాధులుగా నిరూపింపఁబడి బారిపోయి యవధూత వేషములతో వచ్చి యామఠములోఁ జేరి యోగులకు శుశ్రూషఁ జేయుచుండిరి. వాండ్రు కమల వచ్చినదిమొద లామచ్చకంటిపై వలపుఁజెంది యాచిదంబరయోగి నాశ్రయించుచుఁ బాదములొత్తుచు విసరుచు ధోవతు లుతుకుచు నెడతెగక నవ్యాజభక్తి విశేషంబునంబోలె నాశ్రయింపుచుండిరి. వారి దుశ్చేష్టితముల గ్రహించి కమల వారిసమక్షమున నెప్పుడు నిలుచునది కాదు. ఒకనాడు వా రిరువురు నిట్లు సంభాషించుకొనిరి.

స్థూలజంఘుఁడు :- మిత్రమా ! తామ్రకేశా ! ఈ కమల మనమొగ మొకమాటైనం జూడదేమిపాపము? మనకోరిక యెట్లు తీరఁగలదు. అహా! ఈ మోహనాంగి యలంకారశూన్యమై శాటీపటంబుఁ గట్టినను వింతసోయగమునఁ బ్రకాశించుచున్నది గదా ! మన యనంగ చంద్రికకన్న నీ చిన్నదియే సొగసుగా నున్నది?

తామ్ర :- అబ్బా ! సొగసుగా నున్నదని మెల్లగాఁ జెప్పుచుంటివేల? అది యెక్కడ నిదియెక్కడ? హస్తిమశకాంతరము గలదు. దేవతా స్త్రీలైనను దీనిం బోలరని చెప్పఁగలను.

స్థూల :- అవును. నీవు కొక్కోకముఁ జదివితివికావా? నీ కా లక్షణములు బాగుగాఁదెలియ గలవు. ఇది యేజాతియో చెప్పుము?

తామ్ర :- పద్మినీజాతిలో శ్రేష్టమైనది.

స్థూల :- మన ముంచుకొనిన యనంగ చంద్రికయో?

తామ్ర :- అది యేజాతిలోను చేరదు. సంకరజాతి